సీనియర్ నటులు, హీరోయిన్ల లక్కీ హీరో చంద్రమోహన్ (82) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక అయన జీవిత ప్రస్థానంలోకి వెళ్ళితే.... కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే,23 జన్మించిన ఆయన 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'ఆక్సిజన్' ఆయన నటించిన చివరి చిత్రం. ఆయన తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు గానూ ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రెండు నంది పురస్కారాలు దక్కాయి ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. చంద్రమోహన్ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో నిండిపోయింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.