బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్థాన్ అంటేనే మండిపడే భారత్ జనాలు.. ఇప్పుడు పాక్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలతో వారెంత సంస్కార హీనులో మరోసారి వెల్లడైందంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే..ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ టీమ్ దారుణంగా విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు అంతా ఒక్కచోటకు చేరి విమర్శలు గుప్పించారు. బాబర్ ఆజామ్ చెత్త కెప్టెన్సీతోనే పాక్‌కు ఘోర పరాజయం ఎదురైందని, ఇందులో క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పిదం కూడా ఉందని దుమ్మెత్తిపోశారు. కరాచీలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్, అబ్దుల్ రజాక్ వంటి వారంతా పాల్గొన్ని పీసీబీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ‘‘నేను జట్టుకు ఆడే సమయంలో యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతను జట్టును అత్యుత్తమంగా నడిపేవాడు. ఆటగాళ్లకు అండగా ఉంటూ స్పూర్తిని కలిగించేవాడు. అతని మాటలు నన్నే కాదు టీమ్ మొత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అతను ఇచ్చే స్ఫూర్తితో జట్టు కోసం నేను సాధ్యమైనంత చేయగలిగాను. కానీ ఇప్పుడు పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాక్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే జరుగుతుందా?. ఇది కూడా అంతే. ఏదైనా సంకల్పం బలంగా ఉంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి’’ అనేలా మాట్లాడాడు.