నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్.సుధాకరరెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇలాంటి పాత్ర నేనింతవరకూ చేయలేదు. సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా ఖ్యాతి, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. రాజశేఖర్‌గారు మా సినిమాలో స్పెషల్ రోల్ చేసినందుకు చాలా థాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. హ్యారిస్ జైరాజ్ మంచి సంగీతం ఇచ్చారు. రీరికార్డింగ్ కొత్తగా ఉంటుంది. చిత్రం చూసి నా అభిమానులు, ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు’ అన్నారు. నితిన్ చాలా మంచి వ్యక్తి అంటూ ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు శ్రీలీల కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ఒక్కడినే కల కంటే సరిపోదు. హీరో, నిర్మాత, సాంకేతిక నిపుణులు.. అంతా కలిస్తేనే అది నిజం అవుతుంది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్ర నిర్మాణంలో నితిన్, సుధాకరరెడ్డిగార్లు నాకు తోడుగా నిలిచారు. రాజశేఖర్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు’ అన్నారు వక్కంతం వంశీ. రాజశేఖర్ మాట్లాడుతూ ‘నన్ను సడన్‌గా పిలిచారు. కథ చెప్పారు. నన్ను కన్విన్స్ చేశారు. బాగుందని ఒప్పుకొన్నాను ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నితిన్ తెరపై జాలీగా, ఆకతాయిగా నటిస్తారు కదా.. సెట్‌లోనూ అలాగే ఉంటారనీ అనుకున్నాను. కానీ హీరోగా, నిర్మాతగా ఎంతో బాధ్యతతో వ్యవహరించారు. దర్శకుడు నన్ను బాగా చూపించారు’ అన్నారు. రాజశేఖర్‌కు మంచి పాత్ర దొరికితే విలన్‌గా అయినా, ప్రత్యేక పాత్ర అయినా చేస్తారనీ, వంశీ తమకు ఏం చెప్పారో అదే తీశారనీ జీవిత తెలిపారు.