తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాగా మొన్న (గురువారం రోజున) సీఎంగా రేవంత్ రెడ్డి, 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.అయితే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన మేత్రులకు నేడు శనివారం (09.12.2023) రోజున వారికి శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలను సీఎం కేటాయించగా ఈరోజు నుంచి ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.గతంలో 2009లో రాజశేఖర్ రెడ్డి హాయాంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల మంత్రిగా పని చేశారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో తన పదవికి రాజీనామా చేసి అధికార ప్రభుత్వంపై పోరాడిన మొదటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.