ప్రస్తుతం చిత్రపరిశ్రమ కార్పొరేట్ శక్తుల గుప్పెట్లో ఉందని, టీవీల్లో 300కు పైగా ప్రసారమైన చిత్రాలను ఇపుడు రీ రిలీజ్ పేరుతో విడుదల చేయడం ఏమిటని సినీ గేయరచయిత ప్రియన్ ప్రశ్నించారు. తమిళ్ తిరైక్కూడం నిర్మాణంలో ప్రముఖ పాటల రచయిత ప్రియన్ కథను సమకూర్చి దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణం’. వైవిధ్యభరితమైన హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించారు. త్వరలో విడుదల కానుంది. హీరోయిన్‌గా వర్ష నటించారు. లఘుభరణ్, కీర్తనా వంటి పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. నితిన్ కే రాజ్, నౌషద్ ఛాయాగ్రహణం అందించగా, షాజన్ మాధవ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఇందులో దర్శకుడు ప్రియన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తపస్సు వంటిది. మంచి అనుభవం. 20 యేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న వారినే ముప్పుతిప్పలు పెడుతుంటే కొత్తగా వచ్చినవారి పరిస్థితి ఏమిటి? కళను ఆ రంగంలో ఉంటూనే నాశనం చేయడం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాణం అనేక విషయాలు నేర్చుకునేందుకు దోహదపడింది. చాలామంది హీరోయిన్లు తాము నటించిన చిత్రాల ఆడియో ఫంక్షన్లకు హాజరుకావడం లేదు. కానీ, వర్ష మాత్రం నటించడమే కాకుండా, ఒక అసిస్టెంట్ దర్శకురాలిగా కూడా పనిచేశారు.