అక్కినేని నాగార్జున ఇంతకు ముందు రెండు సినిమాలు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సంక్రాంతికి విడుదలచేసి విజయాన్ని అందుకున్నారు. ఈసారి కూడా సంక్రాంతికి ఎలా అయినా విడుదల చెయ్యాలని 'నా సామి రంగ' సినిమాని మూడు నెలల్లో పూర్తి చేసి అనుకున్నట్టుగానే ఈరోజు (జనవరి 14) న విడుదల చేశారు. నాగార్జునతో పాటు ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ రెండు ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఆషిక రంగనాథ్ నాగార్జున పక్కన కథానాయికగా నటించింది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించటం ఆసక్తికరం. మలయాళం సినిమా 'పొరింజు మరియం జోస్' ఆధారంగా తెలుగుదనానికి అనుగుణంగా రచయిత ప్రసన్న కుమార్ కొన్ని మార్పులు చేసి ఈ 'నా సామి రంగ' కథని తయారుచేశారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ఈ కథ అంబాజీపేటలో మొదలవుతుంది. అంజి (అల్లరి నరేష్) చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకుంటాడు, కానీ కిష్టయ్య (నాగార్జున) అంజిని తన సొంత తమ్ముడిగా చూసుకుంటూ కలిసి మెలిసి వుంటారు. సాయం చేసినందుకు అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్)కు అమితమైన గౌరవం ఇస్తాడు కిష్టయ్య. ప్రెసిడెంట్ కూడా కిష్టయ్యని తన సొంత మనిషిలా చూసుకుంటాడు. కిష్టయ్య, వరాలు (ఆషికా రంగనాథ్) చిన్నప్పటినుండి స్నేహితులు, ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు కానీ, వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) ప్రెసిడెంట్ కొడుకు దాసు (షబ్బీర్ కాళ్లరక్కల్)కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ కిష్టయ్య, వరాలు ప్రేమించుకున్నారని తెలిసి ప్రెసిడెంట్ తన కొడుక్కి చేసుకోను అంటాడు. కానీ వరాలు తండ్రికి మాత్రం ఆమె.. కిష్టయ్యని చేసుకోవడానికి ఇష్టపడడు, అందుకని ఒక షరతు పెడతాడు. ఈలోగా అంబాజీపేట కుర్రాడు భాస్కర్ (రాజ్ తరుణ్), పక్కూరు జగ్గన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి (రుక్షర్ థిల్లాన్) తో ప్రేమలో పడతాడు, ఆ ప్రేమ ఈ రెండు గ్రామాల మధ్య వైరం తెస్తుంది. ఇంకో పక్క ప్రెసిడెంట్ కొడుకు దాసు తనని కాదని వరాలు ఎలా కిష్టయ్యని పెళ్లి చేసుకుంటుందో చూస్తా అని పగ పడతాడు. ఇంతకీ వరాలు తండ్రి ఏమి షరతు విధించాడు? భాస్కర్, కుమారిల ప్రేమ పెళ్లివరకు వెళ్లిందా? కిష్టయ్యని చంపడానికి వచ్చిన దాసుని, అంజి ఏమి చేశాడు? సంక్రాంతి నాడు వచ్చే ప్రభల తీర్ధం పండగ ఎందుకు అంత ప్రాముఖ్యం అక్కడ? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'నా సామిరంగ' సినిమా చూడాల్సిందే.