హిందీ పరిశ్రమలో ఇప్పుడు అగ్ర నటీమణుల్లో వున్న కృతి సనన్ మొదటి సినిమా ఎక్కడ చేసిందో తెలుసా, తెలుగులో చేసింది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన '1: నేనొక్కడినే' సినిమాలో కథానాయికగా నటించిన కృతి సనన్ ఆ తరువాత మరొక్క తెలుగు సినిమా మాత్రమే చేసింది, తరువాత హిందీ పరిశ్రమకి వెళ్ళిపోయింది. తెలుగు సినిమాలు మరి చెయ్యలేదు. గత సంవత్సరం కృతి సనన్ హిందీ సినిమాలు మూడు విడుదలయ్యాయి. అందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆల వైకుంఠపురంలో' సినిమాని హిందీలో 'షెహ్ జాద' అనే పేరు మీద రీమేక్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. తరువాత తెలుగు నటుడు ప్రభాస్ తో పాన్ ఇండియన్ సినిమాగా 'ఆదిపురుష్' లో సీతామాతగా కృతి సనన్ చేసింది. కానీ ఈ సినిమాకి వచ్చినన్ని విమర్శలు ఇంకే సినిమాకీ రాలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి, చిత్ర నిర్వాహకులకు మంచి పేరు తీసుకురాలేకపోయింది. తరువాత 'గణపత్' అని ఇంకో సినిమా విడుదలైంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడితే, కృతి సనన్ కథానాయికగా నటించింది. ఇందులో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అయినా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికల బడింది. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే, గత సంవత్సరం జాతీయ అవార్డు అందుకున్న వాళ్లలో కృతి సనన్ కూడా వుంది. 'మిమి' సినిమాలో ఆమె చేసిన పాత్రకి గాను ఉత్తమ నటిగా కృతి సనన్ ఈ జాతీయ అవార్టు అందుకుంది. ఈ సంవత్సరం కృతి సనన్ సినిమా 'తెరి బాతొన్ మె ఐసా ఉజా జియా' వచ్చేనెల అంటే ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. షాహిద్ కపూర్ కథానాయకుడు, ఇందులో కృతి సనన్ ఒక రోబోట్ గా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తే ఆమె రోబోట్ గా చేసింది అని అర్థం అవుతోంది. ఈ సినిమా ప్రచారాలు మొదలుపెట్టేసింది కృతి సనన్. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందని, కృతి సనన్ ఈ సంవత్సరం విజయంతో మొదలు పెడుతుందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.