దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌పై తాజాగా రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ డీప్ ఫేక్ వీడియో విషయంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీ పోలీసులకు నా కృతజ్ఞతలు. వీడియోను సృష్టించిన వారిని అరెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రేమతో ఆదరించి.. అన్నివిధాలుగా నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చెప్పేది ఒక్కటే.. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. ఉపయోగించడం అనేది తప్పు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ’’ అని రష్మిక తన ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. రష్మిక అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు.