కోలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ తండ్రి ఎస్.చంద్రశేఖర్. సినిమా బాలేదని చెబితే అతడు ఫోన్ కట్ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘విజయ్ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా సినీ ప్రేమికుడిగా వింటా. వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి తెలుసుకుంటా. కానీ, నేటి రోజుల్లో స్క్రీన్ ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ సినిమాలో ఒక స్టార్ ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదనుకుంటున్నారు. హీరో వల్లే సినిమా హిట్ అయినా.. తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడు. కథ బాగుంటేనే అది విజయం సాధిస్తుంది. అదే నిజమైన విజయం. స్టార్‌డమ్‌ని బట్టి అన్ని వేళల సినిమా హిట్ కాదని నా అభిప్రాయం. కొన్నాళ్ల క్రితం ఐదు రోజుల్లో రిలీజ్ అనగా.. ఓ సినిమా చూశా. వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి.. ప్రథమార్థం చాలా బాగుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు.. ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పాను. నేను అన్న మాటలకు ఆ దర్శకుడు సర్.. భోజనం చేస్తున్నా. మళ్లీ కాల్ చేస్త్తా’ అని ఫోన్ పెట్టేశాడు. ఆ కాల్ ఇప్పటి దాకా రాలేదు. సినిమా విడుదలయ్యాక చాలామంది నాలాగే చెప్పారు. ఒకవేళ అతడు నా మాట విని మార్పులు చేసి ఉంటే మరొక విధంగా ఉండేది. నా విమర్శలను పాజిటివ్‌గా తీసుకునే ధైర్యం, పరిణతి అతడికి లేవు’’ అని అన్నారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది ‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు ఎక్స్(ట్విటర్) వేదికగా కామెంట్ చేస్తున్నారు. విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లియో’. విజయ్ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రేమికులు అభిప్రాయపడ్డారు.