ఇటీవలే సంక్రాంతికి తమిళనాట థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ధనుష్ , ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ చిత్రం గత వారమే తెలుగులోను థియేటర్లలో రిలీజవగా అంతగా జనాదరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ , తెలుగు నటుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్‌తో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ధనుష్ హయ్యెస్ట్ గ్రాస్‌డ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక కథ విషయానికి వస్తే.. స్వాతంత్య్రం రాక పూర్వం 1930 నుంచి 1940 మధ్య జరిగే కథగా ఈ చిత్రం రూపొందింది. అప్పటి బ్రిటీష్ పాలనలో వారి సామంతులుగా ఉన్న రాజులు తమిళనాడులోని బైరవకోన అనే ఓ మారుమూల గ్రామంలో అరాచక పాలన సాగిస్తుంటారు. అక్కడే ఉన్న ఓ పురాతనమైన దేవాలయాన్ని వారి ఆధీనంలో ఉంచుకుని గుడిలోకి ఇతరులను రానివ్వరు, సమీపంలోనే నివసించే బలహీన వర్గాలపై కూడా లోనికి రాకుండా నిషేధం విధిస్తారు. ఆ ఊర్లోనే ఉండే హీరో (అగ్నీశ్వర్) ఇవేవి నచ్చక బ్రిటీష్ మిలటరీలో చేరతాడు అక్కడ సొంత దేశం వారిని చంపాల్సి రావడంతో మిలటరీ నుంచి బయటకు వచ్చి దొంగగా మారి ఆ ముఠాకు నాయకుడవుతాడు.ఇదిలాఉండగా.. ఊరిలోని దేవాలయంలో తరతరాలుగా రహస్యంగా దాగి ఉన్న ఓ విగ్రహాన్ని బ్రిటీష్ వాళ్లు గుర్తించి తీసుకెళతారు. ఇది ఏమాత్రం ఇష్టం లేని అక్కడి రాజు ఆ విగ్రహాన్ని బ్రిటీష్ వాళ్ల నుంచి తిరిగి తీసుకు రావాలని దొంగల మూఠా హీరో తో బేరం మాట్లాడుకుంటారు. ఈ క్రమంలో దొంగలు ఆ విగ్రహాన్ని దొంగలించడం, విగ్రహంతో హీరోకు, వాళ్ల ఊరికి ఉన్న సంబంధం, ఆ తర్వాత విగ్రహం ఏమైందనే ఆసక్తికరమైన కథనంతో, భారీ యాక్షన్ సీన్లతో సినిమా సాగుతుంది. ముఖ్యంగా ధనుష్ నటన, జీవీ ప్రకాశ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతాయి అదేవిధంగా విగ్రహం దొంగతనం సన్నివేశాలైతే అంతకుమించి అన్నట్లు ఉండి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.యాక్షన్ చిత్రాలు బాగా ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చే ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ముఖ్యంగా హీరో తన పేరు అగ్నీశ్వర్ నుంచి కెప్టెన్ మిల్లర్ గా ఎలా మారాడనే చూయించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా స్లోగా, ఎక్కువగా తమిళ వాసనలతో ఉన్నప్పటికీ ఓటీటీ ప్రియులు ఈ సినిమాను అసలు మిస్సవ్వొద్దు.