ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్నో వేదికలపై జానపద గేయాలతో అలరించిన ఆయన దాదాపు 100కి పైగా సపాటు, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో 'గబ్బర్ సింగ్’ సినిమాలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల’ అనే పాటతో పాపులర్ అయ్యారు. ఆ పాటకుగానూ ఆయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. నాగార్జున నటించిన 'కింగ్’ చిత్రంలో 'ఎంత పని చేస్తివిరో’ పాటను పాడి యూత్ ను అలరించారు. వడ్డేపల్లి శ్రీనివాస్ మృతిపై పలువురు సినీ, జానపద కళాకారులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు చిన్నతనంలోనే జానపద కళ అలవడింది. అమ్మ నోట విన్న పాటల్ని పాడుతూ జానపద కళపై మక్కువ పెంచుకున్నారు. స్కూల్, పండుగ వేదికలపై పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా గోపన్నపాలెంలో ఓ స్కూల్‌లో పి.ఈ.టిగా పనిచేసిన ఆయన తర్వాత పాటనే వృత్తిగా ఎంచుకున్నారు. 1994లో 'కలికి చిలక’ అనే పేరుతో క్యాసెట్ రికార్డ్ చేసి మార్కెట్‌లో విడుదల చేశారు. ఆ క్యాసెట్‌తో జనాల్లోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో పాడటం ఆయన ప్రత్యేకత. చివరి క్షణం వరకూ కూడా అంతరించిపోతున్న జానపద కళను బతికించడానికి ఆయన వంతు కృషి చేశారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన జానపద కార్యక్రమాలు నిర్వహించారు.