డ్రగ్స్ కేసులో తమిళ నటి వరలక్ష్మీ శరతకుమార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! ఎన్‌ఐఏ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై వరలక్ష్మి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై అసత్య కథనాలు ప్రచురించిన పలు మీడియా సంస్థలపై మండిపడుతూ ఎక్స్‌లో(ట్విటర్) పోస్ట్ పెట్టారు. ‘‘మంచి వార్తలు లేకపోవడంతో పలు మీడియా సంస్థలు, నిరాధారమైన పాత వార్తలు ప్రసారం చేయడం నిజంగా బాధాకరం. పలువురు జర్నలిస్ట్‌లు, స్వయం ప్రకటిత వెబ్‌సైట్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని మీరెందుకు ప్రారంభించకూడదు. సెలబ్రిటీలలోని లోపాలను వెతకడం ఇకనైనా మానండి. విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడానికి మేం శ్రమిస్తున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మరి, మీ పని మీరు ఎందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలు వేలకొద్దీ ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా మౌనాన్ని బలహీనతగా భావించకండి. పరువు నష్టం కేసులు కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. కాబట్టి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.