తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో ‘నవతిహి’ పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం.. హైదరాబాద్ పార్క్ హయత్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా నటి మధుమిత శివబాలాజీ వ్యవహరించారు. 1932 నుంచి తెలుగు సినిమా గొప్పదనం గురించి, 1993లో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలిపి.. గత రెండేళ్లలో ‘మా’ చేసిన పనులని వివరించారు మధుమిత శివబాలాజి. అనంతరం విష్ణు మంచు ఈ ప్రెస్ మీట్‌ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ మాట్లాడుతూ.. విష్ణు మంచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయనతో పలు సార్లు మాట్లాడాను. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గురించి, ఇందులో సభ్యులకు చేయాల్సిన పనుల గురించి, ఇన్సూరెన్స్‌ల గురించి, మెడికల్ గురించి, ఆర్టిస్ట్‌ల పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు. ఆయన ఎప్పుడు కలిసినా ‘మా’ గురించే మాట్లాడేవారు. మేము ఈ ‘మా’ ఈవెంట్‌ను మలేషియాలో గ్రాండ్‌గా ఆర్గనైజ్ చేయబోతున్నాం. మలేషియా గవర్నమెంట్‌కి ధన్యవాదాలు. మలేషియా టూరిజంని ‘మా’ అందరికీ పరిచయం చేయబోతున్నందుకు విష్ణు మంచుకి ధన్యవాదాలని అన్నారు. మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ మాట్లాడుతూ.. మలేషియా టూరిజం డైరెక్టర్ తరపున నేను ఇక్కడకు వచ్చాను. జూలైలో ‘మా’ ఈవెంట్ మలేషియాలో జరగబోతుంది. ఈ ఈవెంట్‌తో మలేషియా కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. విష్ణు మంచుకి ధన్యవాదాలు. అందరూ మలేషియాకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇండియా - మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దామని తెలిపారు.