మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామీను రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది. ఇది పబ్లిష్ అవగానే ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్లింది. అంత ఆదరణ పొందింది గోట్ డేస్. కేరళలో ప్రతి దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ ఈ నవల హక్కులు తీసుకోవాలని ప్రయత్నించారు. చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు. అదృష్టవశాత్తూ నజీబ్ గా నటించే అవకాశం నాకు దక్కింది. 2009 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్ లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం. అప్పటికి ప్రాంతీయ సినిమాల మార్కెట్ స్థాయి పెరిగింది. మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్ లో షెడ్యూల్ చేశాం. కేరళ పోర్షన్స్ కంప్లీట్ చేశాం.