"90 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న తెలుగు సినిమా కోసం ఓ భారీ ఈవెంట్ చేయాలని రెండేళ్ల క్రితం అనుకున్నాం. అయితే ఇలాంటి వేడుక చేశామంటే సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే సమయం తీసుకు ఓ ప్రణాళికతో ముందుకెళ్ల బోతున్నా. నవతి పేరిట మలేషియాలో చారిత్రాత్మక ఈవెంట్ చేయనున్నాం’’ అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనతోపాటు మా కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు. "రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలనుకున్నాం. అనేక కారణాల వల్ల నవతి ఉత్సవం వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ గతంలో కూడా జరిగాయి. అప్పటి టీమ్ కూడా మంచిగా ఫండ్ రైజింగ్ చేసింది. ఇప్పుడు అంతకుమించి ఫండ్ రైజ్ అయ్యేలా భారీగా చేయాలని ప్లాన చేస్తున్నాం. అందుకే ఈవెంట్‌ను జులైలో మలేషియాలో చేయదలిచాము. సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడి తేదీని ప్రకటిస్తాం. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్ అందుకోవడం, అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడం, ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ కావడం, మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది. తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్ అనిపించింది. ఈ విషయం గురించి ఛాంబర్ పెద్దలతో మాట్లాడాము. రెండు, మూడు రోజులు ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని కోరాం. దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. ఇతర చిత్రపరిశ్రమల నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఇతర చిత్ర పరిశ్రమల నుంచి కూడా సపోర్ట్ బావుంది. తెలుగు సినిమా ఘనకీర్తిని చాటిచెప్పేలా నవతి ఈవెంట్ చేయబోతున్నాం’’ అని అన్నారు.