నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం పొందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం పొందారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. డేనియల్ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డేనియల్ బాలాజీని తరలించారు. మార్గం మధ్యలోనే డేనియల్ బాలాజీ తుదిశ్వాస విడిచారని సమాచారం అందుతుంది. డేనియల్ బాలాజీ వివాహం చేసుకోలేదు. డేనియల్ బాలాజీ ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అనంతరం సీరియల్స్ లో నటించాడు. 2002లో విడుదలైన 'ఏప్రిల్ మదతి' అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ కి డేనియల్ బాలాజీ సన్నిహితుడు. ఆయన చిత్రాల్లో డేనియల్ బాలాజీ కీలక రోల్స్ చేశాడు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన వెట్టైయాడు వెలైయాడు మూవీలో సైకో కిల్లర్ గా డేనియల్ బాలాజీ అద్భుత నటన కనబరిచాడు. రాఘవన్ గా తెలుగులో ఈ చిత్రం విడుదలైంది.
ఇక తెలుగులో ఆయన మొదటి చిత్రం సాంబ. ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో కీలక రోల్స్ చేశాడు. తెలుగులో డేనియల్ బాలాజీ చివరి చిత్రం టక్ జగదీశ్. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 50 కి పైగా చిత్రాల్లో డేనియల్ బాలాజీ నటించినట్లు సమాచారం. అతని మృతి వార్త తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.