భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఆసక్తికరమైన చిత్రం థియేటర్లలోకి. అదే ఏలియన్ రోములస్. సైన్స్ ఫిక్షన్ హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు16న అమెరికాలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు పెట్టిన పెట్టుబడికి రెండింతలు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఈ శుక్రవారం మనదేశంలో రిలీజ్ ఐనది.కైలీ స్పేనీ , డేవిడ్ జాన్సన్ , ఆర్చీ రెనాక్స్, ఇసాబెలా మెర్సిడ్, స్పైక్ ఫియర్న్, ఐలీన్ ప్రధాన పాత్రల్లో నటించగా ఫెడే అల్వారెజ్ దర్శకత్వం వహించాడు. అయితే ఏలియన్ చిత్రాల సిరీస్‌లో ఇది ఏడవ చిత్రం. కథ విషయానికి వస్తే.. రెయిన్ తన తమ్ముడు సగం మనిషి సగం మిషన్ అయిన ఆండి మరియు తన ఎక్స్ లవర్ ఆమె చెల్లితో కలిసి మరో గ్రహంపైకి వెళతారు. ఈక్రమంలో అక్కడున్న ఓ పాత స్పేస్‌షిప్‌లోకి వెళ్లి క్రయోజనిక్ పార్ట్స్‌ను దొంగిలిద్దామని ప్రయత్నిస్తారు. అయితే అనుకోకుండా లోపల ఫ్రీజ్ అయి ఉన్న ఏలియన్‌ను నిద్ర లేపుతారు, అంతేగాక మరికొన్ని మిషన్‌లను యాక్టివేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి రెయిన్, ఆండి తప్పించుకున్నారా, వాటితో ఎలా పోరాడారు, యాక్టివ్ అయిన మిషన్లు ఏం చేశాయనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. సినిమా హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయి. అయితే ఇప్పటికే ఏలియన్ అనే కథాంశంలో చాలా సినిమాలు వచ్చిన నేపథ్యంలో వాటితో పోల్చుకోకుండా చూస్తే మూవీ నచ్చుతుంది. కాగా ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ సినిమా అంచనాలను బాగా పెంచేశాయి.