విశ్వక్సేన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే.. కెరీర్ ఆరంభం నుంచి హీరోగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యతను చాటుకుంటోన్నాడు విశ్వక్సేన్. థ్రిల్లర్ కథతో విశ్వక్సేన్ చేసిన తాజా మూవీ మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీతో కొత్త దర్శకుడు రవితేజ విశ్వక్సేన్కు హిట్టు ఇచ్చాడా అనాది చూదాం.
రివ్యూ :
రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్సేన్) బీటెక్‌ను మధ్యలోనే ఆపేస్తాడు. మలక్‌పేటలో తండ్రి (నరేష్) నిర్వహించే ఆర్కే గ్యారేజెస్లో మెకానిక్‌గా పనిచేస్తూనే డ్రైవింగ్ పాఠాలు నేర్పుతుంటాడు. రాకీ గ్యారేజీ స్థలాన్ని దొంగ పత్రాలు సృష్టించి రంకిరెడ్డి (సునీల్) అనే రౌడీ ఆక్రమించుకోవాలని చూస్తాడు. రంకిరెడ్డి నుంచి తన స్థలాన్ని కాపాడుకోవడానికి రాకీకి యాభై లక్షలు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి మాయ (శ్రద్ధా శ్రీనాథ్) సాయంతో గట్టెక్కాలని రాకీ అనుకుంటాడు. కాలేజీ రోజుల్లోనే రాకీ ప్రేమించిన ప్రియ (మీనాక్షి చౌదరి) మళ్లీ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవడానికి రాకీ దగ్గరకు వస్తుంది. ప్రియ రీఎంట్రీతో రాకీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రియకు రాకీ దూరమవ్వడానికి కారణం ఏమిటి? రాకీకి దక్కాల్సిన ఓ ఇన్సూరెన్స్ సొమ్ములో నామినీగా మరొకరు పేరు ఎందుకు ఉంది? ఆ పాలసీ ఎవరిది? రాకీ జీవితంలోకి మాయ ఎందుకొచ్చింది?రంకిరెడ్డి నుంచి తన గ్యారేజీని రాకీ కాపాడుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. మెకానిక్ రాకీ ఫక్తు కమర్షియల్ అంశాలతో సాగే థ్రిల్లర్ మూవీ. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలను ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సీరియస్‌గా చెబుతుంటారు. మరికొందరు మాత్రం లవ్, రొమాన్స్, కామెడీ లాంటి అంశాలతో కమర్షియల్ దారిలో థ్రిల్లర్ కథలను చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మెకానిక్ రాకీ రెండో కోవకు చెందిన మూవీ. రాకీ క్యారెక్టర్లో తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో విశ్వక్సేన్ మరోసారి అదరగొట్టాడు. ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సారి డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇదివరకు చేయనటువంటి ఓ కొత్త పాత్రలో కనిపించింది. మీనాక్షి చౌదరి గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. విశ్వక్సేన్తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. నరేష్, హర్షచెముడు, హర్షవర్ధన్‌తో పాటు మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్‌ను పంచుతూనే కామెడీతో మంచి టైమ్‌పాస్ చేస్తుంది.