మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప చిత్రం నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాత్రలకు సంబంధించిన ప్రీ లుక్ ను నేడు విడుదల చేశారు. సాధారణంగా కన్నప్ప చిత్రం నుంచి అప్ డేట్స్ అన్నీ సోమవారం రోజే వెలువడుతుంటాయి. అయితే, ఇవాళ వదిలింది ప్రీ లుక్. అరియానా, వివియానాల పూర్తి లుక్ ను ఆనవాయతీ ప్రకారం సోమవారం (డిసెంబరు 2) నాడే విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం నేడు ప్రకటించింది. మంచు విష్ణు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.