తిరుపతి ప్రకాశ్... 1990లలో కమెడియన్ గా చాలా బిజీ. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఆయన పండించే కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. అలాంటి ఆయన తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "1992లో నేను ఇండస్ట్రీకి వచ్చాను... 300లకి పైగా సినిమాలలో నటించాను. రోజుకి మూడు షిఫ్టులు పనిచేసిన రోజులున్నాయి" అని చెప్పారు. "ఒకప్పుడు దర్శకుల పరిస్థితి వేరు... ఇప్పటి పరిస్థితి వేరు. దర్శకులను కలుసుకోవడం చాలా కష్టంగా మారిందిప్పుడు. ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తున్నారు. లోపల ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. 300 సినిమాలు చేసిన నన్ను కూడా క్యాస్టింగ్ డైరెక్టర్లు ఫొటోలు ఇచ్చి వెళ్లమంటున్నారు. అయినా ఫీల్ కాకుండా నా ఫొటోలు ఇచ్చి వస్తూనే ఉన్నాను. 'చిన్న కేరక్టర్స్ మీకు ఇవ్వలేం సార్' అంటారు... పెద్ద కేరక్టర్స్ కి పిలవరు. నాకు వేషం ఇవ్వకపోయినా ఫరవాలేదు... ఒక్క నిమిషం మాట్లాడితే చాలు" అని తిరుపతి ప్రకాశ్ అన్నారు. "చిరంజీవి గారు వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశాను. చిరంజీవిగారు మమ్మల్ని ఇంటికి పిలిచి స్వయంగా దోశలు వేసి పెట్టేవారు. ఆయన కొత్తగా ముంబై నుంచి 'కేరవాన్' తెప్పించుకున్నప్పుడు, అందులో మమ్మల్ని ఎక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ గారు... నేను కలిసి సరదాగా స్కూటర్ పై తిరిగేవాళ్లం. అవి గోల్డెన్ డేస్... ఆ రోజులను మరచిపోలేము" అని చెప్పారు.