రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని అరెస్ట్ చేయగా..వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో దర్శన్‌కు భారీ ఉపశమనం లభించింది. కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూర్ చేసింది. ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర గౌడ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు చేసింది.అక్టోబర్ 30న వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్‌కు హైకోర్టు ఆరు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే తాజాగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్టైంది.తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య (2024 జూన్ 8న) చేసిందని పోలీసుల విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
హత్య అనంతరం రేణుకా స్వామి మృతదేహాన్ని కామాక్షి పాల్య పీఎస్ పరిధిలోని సుమనహల్లి రోడ్ సైడ్ డంప్‌లో పడేశారు. మృతదేహాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారమందించారు. రేణుకాస్వామితల,ముఖం, డెడ్‌బాడీపై గాయాలు గుర్తించారు. మొత్తం 3,991 పేజీలతో ఉన్న ఛార్జిషీట్‌లో ఏ1గా హీరోయిన్ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ చార్జిషీట్‌ను కోర్టులో ఫైల్ చేసింది.
ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదికలను సైతం సిట్ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.