గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన భారీ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో గేమ్ చేంజర్ చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ నెల 21న అమెరికాలోని డాలస్ నగరంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ నేపథ్యంలో, అభిమానుల కోసం రామ్ చరణ్ ఓ వీడియో సందేశం పంచుకున్నారు. "నమస్తే డాలస్... మీ అందరినీ కలుసుకునేందుకు నేను సూపర్ ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. డాలస్ లో మా చిత్రం గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ ను రాజేశ్ కల్లేపల్లి గారు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్ లో మాతో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఉత్సాహంగా ఉంది... సీ యూ గైస్... లవ్యూ" అంటూ రామ్ చరణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు