అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కెరీర్‌లో మరో హిట్ పడిందా? సమంత స్టార్‌డమ్‌కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడింది.. నందినీరెడ్డికి ఖాతాలో మరో హిట్ చేరిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.
బేబీ (లక్ష్మీ) కల్మషం లేని వృద్ధురాలు. విధి ఆడిన నాటకంలో బలైన ఓ మధ్య తరగతి యువతిగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుంది. భర్త చనిపోతూ చేతిలో పెట్టిన కుమారుడు (రావు రమేష్) ఆమెకు సర్వస్వం. అలాంటి కొడుకుకు తల్లి భారంగా మారుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటిని వీడిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యమైన పరిస్థితిలో 24 ఏళ్ల యువతి స్వాతి (సమంత)గా మారిపోతుంది. చిట్టి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో ఓ సమస్య ఎదురు పడుతుంది.
అత్యంత ఇష్టంగా ప్రేమించిన కుమారుడికి బేబీ ఎందుకు దూరమైంది? ఏ పరిస్థితుల్లో బేబీ 24 ఏళ్ల యువతిగా మారింది? 70 ఏళ్ల నుంచి పడుచు అమ్మాయిలా మారిన తర్వాత ఎదురైన సమస్యలు ఏమిటి? ఆ తర్వాత స్నేహితుడు (రాజేంద్ర ప్రసాద్)తో కెమిస్ట్రీ తెరపైన ఎలా పడింది? నాగశౌర్య క్యారెక్టర్ ఏంటి? దూరమైన తల్లి కోసం శేఖర్ ఎలాంటి ఆవేదనకు గురయ్యాడు. శేఖర్ కుటుంబం బేబీ విషయంలో ఎలా రియలైజ్ అయిందనే ప్రశ్నలకు సమాధానం ఓ బేబీ కథ.గడుసుతనం, పొగరుబోతు తనం, భోళాతనం, దయ అంశాలు కలబోసిన 70 ఏళ్ల బేబీ క్యాంటిన్ నిర్వాహకురాలిగా కథ మొదలవుతుంది. రాజేంద్ర ప్రసాద్ సహాయకుడి జత కలవడంతో మాటలు తూటల్లా, సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగిపోతుంటాయి. కథలో కాన్‌ఫ్లిక్ట్ కారణంగా బేబీ (లక్ష్మీ' స్థానంలోకి సమంత (స్వాతి)గా ప్రవేశిస్తుంటుంది. అప్పటి వరకు ఆహ్లాదకరంగా సాగుతున్న నదీ ప్రవాహం సమంత ఎంట్రీతో కుదుపుకు లోనైనట్టు అనిపిస్తుంది. సమంత హైపర్ యాక్టివ్, ఎనర్జీ కొత్త కోణాన్ని చూపిస్తుంది. తొలిభాగంలో సమంత ఒంటిచేత్తో కథను ఫీల్‌గుడ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఓ చిన్న ట్విస్టుతో తొలిభాగానికి తెరపడుతుంది.
ఇక సెకండాఫ్‌లో కథలోకి అనేక అంశాలు ప్రవేశించడంతో కొంత గందరగోళంగా అనిపిస్తుంది. మ్యూజిక్ కాంపిటీషన్స్ పెద్ద పీట వేయడం ద్వారా ఎమోషనల్‌గా ఉండే స్టోరి పక్కదారి పట్టినట్టు కనిపిస్తుంది. అయితే రాజేంద్ర ప్రసాద్ తన సహజమైన నటనతో మళ్లీ ట్రాక్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు చాలా సార్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో సహజ నటనకు, ఆర్టిఫియల్ యాక్టింగ్‌కు పోటీ జరుగుతుందా అనే ఫీలింగ్ కలగకమానదు. సెకండాఫ్ అంతో ఇంతో ఎమోషనల్‌గా ఉందంటే.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ పుణ్యమే అనిపిస్తుంది. కథను సాగదీసి చివరకు సుఖాంతం చేయడం సాదాసీదాగా ముగింపు పలికారనే ఫీలింగ్ కలుగుతుంది. నాగశౌర్య, సమంత ఎపిసోడ్స్‌లో భావోద్వేగం లోపించినట్టు కనిపిస్తున్నది. అలాగే సమంత తన మళ్లీ వాస్తవ రూపంలోకి వెళ్లే సీన్ హడావిడిగా ఉండటం రక్తికట్టించలేకపోయిందనే ఫీలింగ్ కలుగుక మానదు.
లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటన అదుర్స్ ఓ బేబీ చిత్రం గురించి చెప్పుకోవాలంటే.. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ గురించి ముందుగా చెప్పుకోవాలి. టాలీవుడ్‌కు మా లాంటి నటులు ఎంత ముఖ్యమో అనే విషయాన్ని వీరిద్దరూ తెర మీద చూపించారు. బేబీగా తొలి 30 నిమిషాలు అదరగొట్టారు. తన నటన, డైలాగ్స్, ఎమోషన్స్ పలికించడంలో లక్ష్మీ తెరపైన అద్భుతంగా కనిపించింది. ఇలాంటి అమ్మమ్మో, నానమ్మో ఉంటే బాగుండేదని.. ఒకవేళ లేకపోతే వారి మొమోరీస్ ప్రేక్షకులను వెంటాడే రేంజ్‌లో లక్ష్మీ మెప్పించారు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ను నట కిరీటీ ఎందుకు అంటారో మరోసారి ఓ బేబీ సినిమాలోని పాత్ర ద్వారా చూపించారు. ఈ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ ఓ ఎసెట్. 60 వృద్దుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యం (లుక్) తెర మీద చూస్తుంటే ముచ్చటేసిందనే చెప్పాలి. సినిమాను పూర్తిగా నిలబెట్టారనే ఫీలింగ్ వీరిద్దరూ కలిగించారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఇక సమంత ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి తప్పులు వెతకే అవసరం లేదు. కాకపోతే కాస్తా హైపర్ యాక్టివ్‌ను కాస్త తగ్గిస్తే స్వాతి పాత్ర మరింత మెప్పు సాధించేదేమో అనిపిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం ప్రయత్నించకపోయి ఉంటే ఎమోషనల్‌గా పాత్రను దిద్ది ఉంటే సమంత మరింత ఆకట్టుకొనేదేమో అనిపిస్తుంది. లుక్, గ్లామర్ విషయంలో అదరగొట్టింది. చుట్టూ బలమైన క్యారెక్టర్లు ఉండటం వలన సమంత ఫెర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ కావడానికి ఛాన్స్ దక్కింది.
వృద్ధులు కుటుంబానికి భారం కాదు.. ఓ సంపద లాంటి వాళ్లు అనే భావోద్వేగమైన పాయింట్‌తో చెప్పిన కథ ఓ బేబీ. లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అద్భుతమైన నిధిలా కనిపిస్తారు. సమంత ఎప్పటిలానే హైపర్‌యాక్టివ్ బిహేవియర్‌తో తన సత్తాను చాటుకున్నది. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు సినిమాను పట్టు తప్పేలా చేశాయి. కొన్ని లాజిక్‌లకు అతీతంగా సినిమా తెరకెక్కించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, వీకెండ్‌లో కుటుంబంతోపాటు చక్కగా చూడగలిగే సినిమా. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఆదరిస్తే.. కమర్షియల్ సక్సెస్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
రివ్యూ : 3/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa