స్టార్ హీరోలు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని , కొత్త తరహా పాత్రలు చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భావనలో కనీసం ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు . అందునా తెలుగు సినీ పరిశ్రమలో ఐతే మరీనూ . కానీ తమిళ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ని పట్టించుకోకుండా కేవలం కథను నమ్మి సినిమాలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ అతి కొద్దిమంది హీరోలలో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వైవిధ్యం కొరకు నిత్యం పరి తపించే విక్రమ్ ఒకరు. ’ఐ’ చిత్రం కొరకు పరిమితి కి మించి బరువు తగ్గి సినిమా కొరకు ప్రాణాలు పణంగా పెట్టాడు.
సినిమాను వ్యాపారంగా కాకుండా కళగా భావించే స్టార్ హీరో కమల్ హాసన్ ఈయనకు స్ఫూర్తి. కమల్ వేసిన విభిన్న గెటప్స్ , చేసిన ప్రయోగాలు మన భారత్ లోనే కాదు, ప్రపంచం లో ఏ దేశంలోనూ ఎవరు చేసి వుండరు. దశావతారం చిత్రంలో కమల్ ఏకంగా 10 విభిన్న గెటప్స్ లో కనిపించి రికార్డు సృష్టించారు.
ఐతే విక్రమ్, కమల్ రికార్డుని బద్దలు కొట్టడానికి రెడీ అయ్యారని వినిపిస్తోంది 7స్క్రీన్ స్టూడియోస్, వయకామ్ 18 స్టూడియోస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ 58 వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రంలో ఏకంగా 25 విభిన్న గెట్ ప్స్ లో కనిపించనున్నారట. ఓ ప్రముఖ అమెరికన్ కంపెనీ ఇప్పటికే ఆయన గెటప్స్ కి సంభందించిన డిజైన్స్ రెడీ అయ్యిందని , ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలియవచ్చింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 2020లో ఈ సినిమా విడుదల చేయనున్నారని సమాచారం.
