ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛైర్మన్‌గా నాకు అవకాశం రావటం సంతోషంగా ఉంది: సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 08:02 PM

హైదరాబాద్‌ బస్‌భవన్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ ఆధ్వర్యంలో 210వ ప్రైస్‌ రివిజన్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్‌ కమిటీ (స్టోర్స్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) ఛైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


 బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూప్‌లకు సంబంధించిన ధరలను నిర్థారించారు. ఈ సందర్బంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి ఆర్టీసీల పరిరక్షణ కోసం ఏఎస్‌ఆర్టీయూ కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ వృద్ధి చెందడానికి మంచి అవకాశాలున్నాయన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలన్నారు.


కీలకమైన స్టాండింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఏఎస్‌ఆర్టీయూ నిర్థారించి సిఫార్సు చేసిన రేట్‌ కాంట్రాక్ట్‌ ప్రకారం ఏకరీతి ధరలకు కొనుగోలు చేస్తే తక్కువ ధరకే నాణ్యమైన విడి భాగాలు లభిస్తాయని చెప్పారు. ఏఎస్ఆర్టీయూ రేట్ కాంట్రాక్ట్‌ను అమలు చేస్తే కొనుగోళ్లలో పారదర్శకత ఉంటుందని చెప్పా్రు. ఈ సమావేశంలో బస్సుల స్పేర్ పార్ట్స్ కొనుగోళ్లకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగిందని, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తదితర ఆర్టీసీలకు చెందిన అధికారులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు.


వచ్చే నెలలో జరిగే సమావేశంలో వాటిపై చర్చించి రెండేళ్ల పాటు అమలయ్యే ఏకరీతి ధరలను స్టాండింగ్ కమిటీ నిర్ధారిస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకటే రేట్ కాంట్రాక్ట్‌ను నిర్దారించించడం వల్ల ఆర్టీసీలకు సమయం ఎంతో ఆదా అవుతుందని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు మేలు చేసే రేట్ కాంట్రాక్టును దేశంలోని ప్రతి ఆర్టీసీ సంస్థ విధిగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఆర్టీయూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సూర్యకిరణ్‌, డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌కే కిషోర్‌, టీఎస్‌ఆర్టీసీ సీఎంఈ రఘునాథరావుతో పాటు 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa