ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవిత అవసరం తన కొడుక్కి ఉంది.. బెయిల్‌ విచారణలో కీలకంగా 'మోదీ లెక్చర్'.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 07:22 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ బలమైన వాదనలు వినిపించగా.. ఈడీ కూడా అదే స్థాయిలో ప్రతివాదనలు వినిపించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును సోమవారం వెలువరించనుంది. అయితే.. బెయిల్ విచారణలో భాగంగా.. వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన లెక్చర్‌ను ధర్మాసనం ముందు ప్రస్తావించారు.


కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని సింఘ్వీ కోరారు. కవిత అరెస్ట్‌ కారణంగా.. ఆమె కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితుల్లో ఉన్నాడంటూ తెలిపారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓవైపు తల్లి అరెస్టవటం.. మరోవైరు కోర్టుల చుట్టూ తండ్రి తిరుగుతుండటంతో.. మానసికస్థైర్యం కోల్పోయాడంటూ వివరించారు. తండ్రి ఉన్నప్పటికీ తల్లి పాత్రను ఆయన భర్తీ చేయలేరని.. పరీక్షల సందర్భంగా తల్లి మద్దతు పిల్లలకు అవసరమని తెలిపారు.


పిల్లల పరీక్షల సన్నద్ధతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా సందర్భాల్లో ప్రసంగాలు ఇచ్చారని.. ధర్మాసనానికి సింఘ్వీ గుర్తుచేశారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున పీఎంఎల్ఏ సెక్షన్ 45 కింద.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈసందర్భంగా.. ప్రీతి చంద్రా, సౌమ్య చౌరసియా, సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు. షరతులతో కూడిన బెయిల్‌కు ఇచ్చినా.. తమకు అభ్యంతరం లేదని ధర్మాసనాన్ని కోరారు.


మరోవైపు.. కవితకు ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని ఈడీ వాదించింది. కవిత కుమారుడు ఒంటరిగా ఏం లేడని.. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు వివరించారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు కానీ.. పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. కవితను ఆమె ముగ్గురు సోదరీమణులు ములాఖత్ అయ్యారని చెప్పుకొచ్చారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని.. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ధర్మాసనానికి తెలిపారు.


లిక్కర్ స్కాం కేసులో కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని.. అసలు ప్లాన్ చేసిందే కవిత అని ఈడీ వాదించింది. ఫోన్ డేటాను కవిత డిలీట్ చేశారని.. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తం 10 ఫోన్లు కవిత ఇచ్చారు కానీ.. అవన్ని ఫార్మాట్ చేసినవేనన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని, అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని కోర్టు దృష్టికి ఈడీ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ తరపు న్యాయవాది జడ్జికి సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సోమవారానికి (ఏప్రిల్ 8) వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకే ఉండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa