ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్, ప్రయాణాలు ఈజీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 08:03 PM

తెలగు రాష్ట్రాల్లో ఈనెల 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు.. ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు ఓటేసేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. అందుకు ట్రైన్లు, ఆర్టీసీ బ్ససులను ఆశ్రయిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు సాగిస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పెద్దసంఖ్యలో స్పెషల్ బస్సులు నడుపుతోంది.


ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ ముందుగానే రిజర్వ్‌ అయిపోయాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ గురువారం అదనంగా మరో 160 సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైచిలుకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఈనెల 10, 11, 12 తేదీల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ మూడు రోజుల్లో తెలంగాణ జిల్లాలకు 1,400 సర్వీసుల్ని అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతోపాటు ఆరాంఘర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు బయల్దేరేలా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, వరంగల్‌ తదితర ప్రాంతాలకు డిమాండ్‌కు అనుగుణంగా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్టీసీలో గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రజల ప్రయాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. బస్సులు చాలకపోవడంతో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కూడా దూరప్రాంతాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులను జిల్లాలకు నడపనున్నారు.


ఇక హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ రోజూ 300 బస్సులు నడిపిస్తోంది. ఈ బస్సులన్నింట్లోనూ ముందస్తు రిజర్వేషన్లు అయిపోయాయి. స్పెషల్ బస్సుల్లోనూ టికెట్లు వేగంగా రిజర్వు అవుతున్నాయి. దీంతో ఈ నెల 10న 120, 11న 150, 12న 130 స్పెషల్ బస్సులను నడుపుతోంది. వీటిని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడిపుతున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు టీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa