వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించేందుకు అమెరికా చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను రచ్చకీడ్చింది. ఈ భారీ మిషన్ ప్లానింగ్‌లో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (DNI) తులసీ గబ్బార్డ్‌ను పక్కన పెట్టడం ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 18 నిఘా సంస్థలకు అధిపతిగా ఉన్న ఆమెను కీలకమైన వార్ రూమ్ చర్చలకు దూరంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
'DNI' అంటే 'డూ నాట్ ఇన్వైట్'..!
తులసీ గబ్బార్డ్‌ను ఈ ఆపరేషన్ నుంచి ఎంతగా దూరం పెట్టారంటే.. వైట్ హౌస్‌లోని కొందరు సహాయకులు ఆమె పదవిని ఉద్దేశించి 'DNI' అంటే 'Do Not Invite' (ఆహ్వానించవద్దు) అని సరదాగా జోకులు వేసుకుంటున్నట్లు సమాచారం. గతంలో వెనిజులాపై సైనిక చర్యను ఆమె తీవ్రంగా వ్యతిరేకించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. "వేరే దేశాల నాయకులను మనం ఎంచుకోవడం ఏంటి?" అని 2019లో ఆమె చేసిన వ్యాఖ్యలు, యుద్ధాలను వ్యతిరేకించే ఆమె వైఖరిపై ట్రంప్‌కు నమ్మకం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వార్తలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు. తులసీ గబ్బార్డ్‌ను, తనను ఈ ప్లానింగ్ నుంచి తప్పించారన్న వార్తలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. "మేమంతా ఒకే జట్టు. ఈ ఆపరేషన్ చాలా రహస్యంగా సాగాలని మేము భావించాము. అందుకే పరిమిత సంఖ్యలో అధికారుల మధ్యే చర్చలు జరిగాయి" అని వాన్స్ సమర్థించుకున్నారు. అటు వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ కూడా స్పందిస్తూ.. తులసిపై ట్రంప్‌కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
ఫోటోల్లో కనిపించని 'టాప్ స్పై'
వైట్ హౌస్ విడుదల చేసిన మదురో ఆపరేషన్ ఫోటోల్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ.. తులసీ గబ్బార్డ్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఒక దేశాధినేతను పట్టుకునే ఆపరేషన్‌లో ప్రధాన నిఘా సలహాదారు లేకపోవడం అత్యంత అసాధారణం అని మాజీ నిఘా అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
విశ్లేషణాత్మక పాత్రకే పరిమితం?
తులసిని పూర్తిగా తప్పించలేదని.. ఆమె విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని అందించారని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత తులసీ గబ్బార్డ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ మిషన్‌ను ప్రశంసించారు. అయితే ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆమె బీచ్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేయడం, రోజుల తరబడి మౌనంగా ఉండటం ఆమె అసంతృప్తిని సూచిస్తున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మదురోను పట్టుకున్న విజయం ఒకవైపు ఉన్నా.. ట్రంప్ యంత్రాంగంలో తులసీ గబ్బార్డ్ పాత్రపై నెలకొన్న నీలినీడలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa