ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చాం: బండి సంజయ్, కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 07:34 PM

భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్‌ను రూపొందించిందని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.  2047 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్‌ను నెంబర్ వన్‌గా చూడాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్నారు. బడ్జెట్‌లో ఏకంగా 11 లక్షల 50 కోట్ల రూపాయలను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమన్నారు. దేశంపట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్‌కు నిదర్శనమన్నారు.


కాగా.. తెలంగాణకు మొండి చేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని బండి సంజయ్ ఖండించారు. వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. దేశంలో తెలంగాణ సహా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతోందన్నారు. శాఖల వారీగా బడ్జెట్‌లో ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.


బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిందని.. ఆనాటి యూపీఏ ప్రభుత్వమైతే దానికి వంతపాడింది కేసీఆర్ అనే విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తీరుతుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏ సాధించారో సమాధానం చెప్పాలని నిలదీశారు.


పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పొందుపర్చిన యూపీఏ సర్కార్.. వంతపాడిన కేసీఆర్... తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు ఆ చట్టంలో ప్రస్తావించలేదో సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మీడియా ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం కనీస ప్రయత్నం చేయలేదన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కూడా ఉద్దేశపూర్వకంగానే సమర్పించలేదని... వీళ్లా జాతీయ హోదా గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.


వరంగల్‌లో టెక్స్ టైల్ పార్కును ఎన్నడో ప్రకటించడంతో పాటు నిధులు కేటాయించిన తరువాత మళ్లీ దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని 210 కి.మీల భాగం ఉంది. అందులో కేసీఆర్ దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా పరిధి ఎక్కువగా ఉన్న సోయి కూడా ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. రైల్వే వోరాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సంగతిని మర్చి కోచ్ ఫ్యాక్టరీని ప్రస్తావించడం సిగ్గు చేటని విమర్శించారు.


ఇవేకాదు... తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చిందని బండి సంజయ్ వివరించారు. వివిధ శాఖల వారీగా బడ్జెట్ పూర్తి కేటాయింపుల తరువాత వాస్తవాలు ప్రజల ముందుంచుతామన్నారు. అబద్దాలు, దొంగ హామీలతో పబ్బం గడపాలనుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన సంగతిని మర్చిపోయి కేంద్రంపై విషం కక్కుడం ఆ పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని, తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర సహకారంపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయా పార్టీల నేతలకు సూచిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.


సమతుల్య బడ్జెట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందన్నారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని వివరించారు.


సబ్ కే సాథ్ సబ్ కా వికాస్‌లో భాగంగా.. పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి 10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించిందన్నారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్‌‌లో ప్రతిపాదనలు చేసిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని తెలిపారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేసిందన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా.. పన్ను స్లాబ్‌లను మార్చిందని.. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa