ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ ఉదయం సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర... పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు.
430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును సీఎం రేవంత్ తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.
ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. నవతరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తల భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను సీఎం రేవంత్ వారికి వివరించారు.
ఫోర్త్ సిటీ రూపకల్పనలో సీఎం రేవంత్ దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో రేవంత్ విజన్ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa