హైదరాబాద్‌లో అన్ని దారులు సాగర్ వైపే వెళుతున్నాయి. తీన్‌మార్ సౌండ్లతో నగరం దద్దరిల్లిపోతోంది. భాగ్యనగరం కాషాయం పులుముకుని నృత్యం చేస్తోంది.గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయల్దేరాయి. చలో నిమజ్జన సాగర్ అంటూ వేలాదిమంది గణనాథులు తరలివస్తున్నారు. రకరకాల ఆకారాల్లో, వివిధ సైజుల్లో వినాయకులు నిమజ్జనానికి తరలి వెళుతున్నారు. లక్షలాదిమంది భక్తులు జోరుగా హుషారుగా చిందేస్తూ… బొజ్జ గణపయ్యలను సాగనంపుతున్నారు. నిన్నటి వరకూ జై జై గణేశా.. ఇవాళ బై బై గణేశా.. గంగమ్మ ఒడికి గణేశుడు.. నాన్‌స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ నిమజ్జన జ్వరంతో ఊగిపోతోంది భాగ్యనగరం. తీన్‌మార్ డప్పు చప్పుళ్లకు పిల్లాపెద్దా యూత్ చిందేస్తున్నారు. కాషాయంతో నగరం కలర్‌ఫుల్‌గా మారింది.
గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలకు 25 వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 3 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మద్యం తాగి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర పెద్ద చెరువులతో పాటు, GHMC ఏర్పాటుచేసిన బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్‌లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయాలు పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. GHMC పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలి స్తున్నాయి. ఈ ఏడాది 30 వేల విగ్రహాలు ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం అవుతాయని భావిస్తున్నారు. మహిళల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 12 షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిమజ్జనం సందర్భంగా ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్ అయ్యాయి.
నిమజ్జనం తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత నిమజ్జనం పూర్తయిన వాహనాలను ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఇక మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్ ట్యాంక్ దగ్గర నిలిపేస్తున్నారు. కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులను ఖైరతాబాద్ వరకే అనుమతి ఇస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ క్రాస్ రోడ్ వరకే అనుమతిస్తున్నారు. గడ్డి అన్నారం వైపు వచ్చే వాహనాలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బ్రేకులు వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలను IS సదన్‌లో నిలిపివేస్తున్నారు.
నారాయణగూడ వరకే ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. రాజీవ్ రహదారి నుంచి వచ్చే అంతర్రాష్ట్ర బస్సులను ఫీవర్ ఆస్పత్రి మీదుగా ఎంజీబీఎస్‌కు మళ్లిస్తున్నారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులను చాదర్‌ఘాట్ మీదుగా ఎంజీబీఎస్‌కు మళ్లిస్తున్నారు. రేపు రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నగరంలోకి అనుమతించరు. బాలాపూర్‌లో కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్ విగ్రహాల ప్రధాన ఊరేగింపు ప్రారంభమైంది. మిగిలిన అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఊరేగింపులు దానిలో కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa