హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి రాత్రివేళలో వెళ్లలేం.. పగటి సమయంలో కూడా ప్రస్తుత రహదారిపై 30-40 కి.మీ. కంటే వేగంగా ప్రయాణించలేం. ఈ వేగం ఏమాత్రం పెరిగినా జరిమానాలు చెల్లించక తప్పదు. ఇక, వన్యప్రాణుల దాడి భయమూ వెన్నాడుతోంది. ఈ ఇబ్బందులు నుంచి ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అవి కార్యరూపం దాలిస్తే... మన్ననూరు చెక్‌పోస్టు నుంచి ఏకంగా 55 కి.మీ. పొడవైన ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. దీని మీదుగా నల్లమల అందాలను వీక్షిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, నేరుగా శ్రీశైలం వరకు ప్రయాణించవచ్చు. అంతేకాదు, దీని వల్ల ప్రయాణ సమయమూ తగ్గిపోవడమే కాదు.. వేగంపై ఆంక్షలూ తొలగే అవకాశం ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్- శ్రీశైలం- నంద్యాల నేషనల్ హైవే 765 అత్యంత కీలకమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఆలయ దర్శనాలకు వెళ్లే భక్తులకు తుక్కుగూడ, ఆమనగల్లు, డిండి, మన్ననూరు మీదుగా ఈ రోడ్డే ముఖ్యమైంది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు దీనిపైనే ప్రయాణం సాగిస్తారు. వారంతాల్లో హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఏడు వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. నల్లమల అడవి మధ్య నుంచి వెళ్లే ఈ రహదారి మార్గంమధ్యలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉంది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం కారణంగా ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జాతీయ రహదారిపై ఏకంగా 55 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రెండు వారాల కిందట వీటిని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)కిసమర్పించారు.
హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో ఘాట్ రోడ్డు మొదలయ్యే ప్రాంతం నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనేది ప్రతిపాదన. మన్ననూరు చెక్‌పోస్టుకు ముందు ఉన్న బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై... దోమలపెంట తర్వాత వచ్చే పాతాళగంగ (తెలంగాణ సరిహద్దు) వరకు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. ఘాట్ రోడ్డులో దట్టమైన అమ్రాబాద్ అభయారణ్యం మీదుగా సాగే ఈ కారిడార్‌లో జనావాసాలు ఉన్న మన్ననూరు, దోమలపెంటల వద్ద బైపాస్‌లు, మూలమలుపులు ఉన్న చోట నేరుగా వంతెన వెళ్లేలా ప్రతిపాదించారు.
ఆర్ అండ్ బి అధికారి ఒకరు మాట్లాడుతూ..‘మన్ననూరు- ఫర్హాబాద్ జంగిల్ సఫారీ- వటవర్లపల్లి- దోమలపెంట మీదుగా 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఎలైన్‌మెంట్‌పై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. .ఇది సాకారమైతే రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెన అవుతుంది.. దీని అంచనా వ్యయం రూ.7,000 కోట్లు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ అమనుతి కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ ఆమోదం రాగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై దృష్టి సారిస్తారం’ అని తెలిపారు. ఇక, పాతాళగంగ నుంచి శ్రీశైలం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహా ఎలైన్‌మెంట్ రూపొందించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa