ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్ట్‌ మ్యాన్ నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగం చేజార్చుకున్న యువకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 06:02 PM

పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడి ప్రభుత్వ ఉద్యోగానికి దూరమయ్యాడు. నోటికాడి ముద్ద నేలపాలైందన్న చందంగా.. తృటిలో ఉద్యోగాన్ని చేజార్చుకున్నారు. కాల్ లెటర్ కోసం కోటి ఆశలతో ఎదురు చూసిన యువకుడికి.. పోస్ట్ మ్యాన్ సకాలంలో లెటర్ ఇవ్వకపోవడంతో ఇంటర్వ్యూకు హాజరు కావటం మిస్ అయ్యాడు. దీంతో ఉద్యోగం చేజారిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం వెంగాళాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన యాకారి అనిల్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అయినా తల్లి కష్టపడి కుమారుడిని చదవించింది. తల్లి కష్టంతో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అనిల్ చదువు పూర్తి చేశాడు. అనంతరం ఇంట్లో వాళ్లకు ఆసరాగా నిలిచేందుకు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఓ వైపు లెక్చరర్‌గా కొనసాగుతూనే తన కలల కొలువైన ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు అప్లయ్ చేసుకున్నాడు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్‌లో అనిల్ చోటు సంపాదించాడు. అయితే షార్ట్‌ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు అభ్రర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత శాఖ అధికారులు అభ్యర్థులకు లేఖలు పంపారు.


ఆగస్టు 31 తేదీనే లెటర్ పోస్ట్ చేయగా.. పోస్ట్ మ్యాన్ ఆలస్యంగా లెటర్ అందజేశాడు. 22 రోజుల తర్వాత సెప్టెంబర్ 23న అనిల్ తల్లికి లెటర్ అందజేశాడు. అంటే సెప్టెంబర్ 20న ఇంటర్వ్యూలు అయిపోతే.. మూడ్రోజుల తర్వాత 23న లెటర్ అందజేసారు. ఆలస్యంగా లెటర్ అందుకున్న అనిల్.. ఆవేదనకు గురయ్యాడు. పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగానే తనకు ఉద్యోగం పోయిందని వాపోయాడు. ఇంటర్వ్యూకు హాజరైతే ఉద్యోగం వచ్చి ఉండేదని.. తృటిలో ఉద్యోగం చేజారిందని తనకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


కాగా, పోస్ట్ మ్యాన్ వ్యవహార శైలి మెుదట్నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఉద్యోగం కొడుకుది అయితే తండ్రి డ్యూటీ చేస్తున్నట్లు తెలిసింది. వెంగాలాయి పేట పోస్ట్ మ్యాన్ అయిన రమాపతి రావు కరీంనగర్‌ టౌన్‌లో ఉంటుండగా.. తనయుడి డ్యూటీ తండ్రి గోపాల్ రావు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా పోస్ట్ మ్యాన్ తప్పిదాల వల్ల గొడవలు అయినట్లు వెల్లడించారు. అనిల్ ఉద్యోగం కోల్పోవటానికి కారణమైన పోస్ట్ మ్యాన్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa