తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల కార్డుల మంజూరుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులకు సూచించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని చెప్పారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సెక్రటేరియట్‌లో శనివారం (సెప్టెంబర్ 28) సీఎం రేవంత్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో డిజిటల్ కార్డుల అమలుపై చేసిన అధ్యయన వివరాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మట్లాడిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు.
ప్రస్తుత రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వివరాలు అవసరం లేదన్ననారు. వాటితో పని లేకుండా కార్డులు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలన్నారు.
మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 3 వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి (డోర్ టు డోర్) పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa