దేశమంతా దేవీ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుని పులకించిపోతుంటారు. అంత ప్రత్యేకంగా అమ్మవారిని ముస్తాబు చేస్తుంటారు పూజారులు. ఈ క్రమంలోనే ఓ ఆలయంలో అమ్మవారిని ముస్తాబు చేసిన పూజారి తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమ్మవారిని చీరతో కాకుండా ఓ ఫ్రాక్ వేసి ముస్తాబు చేయటం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అయితే.. అలా ఎందుకు ముస్తాబు చేశారు.. చీరతో కదా చేయాలని మహిళా భక్తులు నిలదీస్తే.. ఆ పూజారి ఇచ్చిన సమాధానం వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబికా ఆలయంలో చోటుచేసుకుంది.
నిమిషాంబికా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నిమిషాంబికా అమ్మవారు.. బాల త్రిపురి సుందరి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 04న) కూడా కావటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి వచ్చారు. అయితే.. అమ్మవారిని చూసి కొందరు మహిళా భక్తులు అవాక్కయ్యారు.
పట్టు చీరలో దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమివ్వాల్సిన అమ్మవారు.. ఓ గౌనులో దర్శనమివ్వటం చూసి ఆశ్చర్యపోయారు. అమ్మవారికి గౌను ధరింపజేయటమేంటని.. గుడిలోని పూజారిని ప్రశ్నించారు. బాలాత్రిపుర సుందరి రూపం అంటే.. పట్టుచీరలో ఎంతో అందంగా సుందరమైన రూపంలో దర్శనమివ్వాల్సిన అమ్మవారిని ఇలా గౌను వేసి ముస్తాబు చేయటమేంటని నిలదీశారు. మహిళలు నిలదీయటంతో.. తీవ్ర కోపోద్రిక్తుడైన ఆ పూజారి.. తనకే శాస్త్రం నేర్పిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"బాలత్రిపుర సుందరి దేవీ రూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా..? మీకు తెలియదని కాదు.. ఇలా అమ్మవారికి ఫ్రాక్ తొడుగుతారా.." అంటూ ఓ మహిళా భక్తురాలు ఆ పూజారిని ప్రశ్నించింది. దీంతో శిగమూగిపోతూ.. "శాస్త్రం నీకు తెలుసా..? నాకు తెలుసా..? బాలాత్రిపుర సుందరి దేవీ రూపంలో ఉంది.. బట్టలు విప్పేసుకుని లేదు. మీలాగా జుట్టు విరబూసుకొని లేదు. గాజులు లేకుండా లేదు.." అంటూ అనుచితమైన పదాలతో అసభ్యకరరీతిలో దురుసుగా సమాధానం ఇవ్వటంతో.. అవాక్కవటం అక్కడున్న మహిళల వంతైంది.
ఆ తర్వాత ఆ పూజారితో మహిళలు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. అమ్మవారికి గౌనుతో ముస్తాబు చేసి అపచారం చేయటమే కాకుండా.. ఇలాంటి అసభ్యకరమైన రీతిలో సమాధానం చెప్పటమేంటంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తంతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అమ్మవారిని గురించి ఒక పూజారి అలా మాట్లడటం వింటుంటేనే అసహ్యంగా ఉందని.. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa