తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీని పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిందంటూ.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రైతు రుణం పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాగా.. ఈ ధర్నా కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుని.. సభ మొత్తం నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా పాల్గొన్నారు. అయితే.. కార్యక్రమంలో తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో.. ఊహించని ఘటన చోటుచేసుకుంది.
తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ తొండ స్టేజిపైకి దూసుకొచ్చింది. అంత మంది ఉన్నప్పటికీ ఏమాత్రం బయపడకుండా వచ్చిందో.. అంతమందిలో ఎటు వెళ్లలేక ఆగమై వచ్చిందో గానీ.. నేరుగా స్టేజి మీదికి మాత్రం దూసుకొచ్చింది. అప్పటికే స్టేజి మీద హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆ పక్కనే సత్యవతి రాథోడ్, మాలోతు కవిత కూర్చొని ఉండగా.. వారి మధ్యలో నుంచే ఆ తొండ నేరుగా.. రాజయ్య పంచలోకి చొరబడింది. అప్పటికీ.. కార్యకర్తలు తొండా అని చెప్పటంతో.. కూర్చున్న హరీష్, ఎర్రబెల్లి, సత్యవతి, కవిత ఒక్కసారిగా ఉలిక్కిపడే లేచి నిల్చున్నారు.
అయితే.. ఆ తొండ తనపైకి వస్తుందని మిగతా వాళ్లు చెప్పగా.. "ఆ తొండలు మనల్ని ఏం చేస్తాయ్.." అంటూ తాటికొండ రాజయ్య డైలాగ్ చెప్పాడు. ఆయన నవ్వుతూ చెప్పిన డైలాగ్‌ను ఆ తొండ విన్నదో ఏమో నేరుగా.. రాజయ్య పంచలో దూరింది. ఆ డైలాగ్ పూర్తి చేసేలోపే.. పంచలో నుంచి నేరుగా షర్టులోకి దూరి.. భుజంపైకి దూసుకొచ్చింది. అది గమనించిన రాజయ్య.. అటు ఓ చేత్తో మైక్ పట్టుకుని డైలాగ్ చెప్తూనే.. మరో చేత్తో ఆ తొండను దొరకబట్టారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది.
షర్ట్ లోపలే ఉన్న ఆ తొండను.. బయటకు తీసేందుకు అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు ప్రయత్నించారు. చివరికి.. రాజయ్య మెడలో ఉన్న కండువాతోనే ఆ తొండను పట్టుకుని బయటికి విసిరేశారు. అంతసేపు ఆ తొండను వదలకుండా పట్టుకున్న రాజయ్యతో పాటు.. సభలో ఉన్న అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. ముఖ్యంగా మాలోతు కవితతో పాటు మరికొందరు మహిళా కార్యకర్తలు ఇంకాస్త ఎక్కువే నవ్వారు. అయితే.. "ఇది ప్రభుత్వ కుట్రే.." అంటూ తాటికొండ రాజయ్య పేల్చిన జోకులతో మరికొంతసేపు ఆ సభ ప్రాంగణమంతా నవ్వులు పూశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa