ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్బురపరుస్తోన్న హైదరాబాదీ ఫ్యామిలీ,,,ఒకే కుటుంబానికి 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:11 PM

ప్రతి మనిషిలో ఓ ప్రత్యేక కళ ఉంటుంది. దాన్ని ఎవరో ఒకరు గుర్తించి.. బయటికి తీసే వరకు వారిలో ఆ కళ ఉందన్న విషయం వారికి కూడా తెలియదు. తెలిసిన తర్వాత ఆ కళలో కొందరు రాణిస్తారు.. మరికొందరికి అది తెలిసేలోపే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. కొందరు మాత్రం తమలో ఉన్న కళను స్వయంగా గుర్తించుకుని.. తమను తాము చెక్కుకుని.. అందులో నిష్ణాతులై.. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా మంది స్ఫూర్తినిస్తుంటారు. ఇక.. మరికొందరు మాత్రం వీళ్లందరికీ భిన్నం. ఆటవిడుపులో భాగంగా అలవాటు చేసుకున్న కొన్ని హాబీలతోనే రికార్డులు సృష్టిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అచ్చంగా.. ఈ హైదరాబాదీ ఫ్యామిలీ కూడా అదే కోవకు చెందుతుంది. ఈ ప్యామిలీలో అమ్మా నాన్నా ఓ కూతురు ఉంటే.. ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు.. ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుని.. ఔరా అంటూ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు.


నిజానికి.. ఏదో ప్రత్యేకమైన టాలెంట్ ఉంటేనో.. లేదా ఎవరికీ సాధ్యపడని సాహసం చేస్తేనో గిన్నిస్ బుక్ రికార్డులు నమోదవుతుంటాయి. అయితే.. ఆ రికార్డులు సాధించేందుకు చాలా మంది ఎంతగానో కష్టపడుతుంటారు. కొన్నేళ్ల పాటు పడ్డ కష్టానికి ఫలితమే ఆ రికార్డు. అయితే.. ఈ ఫ్యామిలీకి మాత్రం రికార్డులు కొట్టటం కూడా ఓ హాబీగా మారిపోయిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థురాలైన శివాలి జోహ్రీ శ్రీవాస్తవతో పాటు ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ, అనిల్ శ్రీవాస్తవ కలిసి ఏకంగా 20 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదు చేసి చరిత్ర సృష్టిస్తే.. హాబీ అనక మరేమంటారు.


  హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవ.. తాజాగా మూడు (18, 19, 20) గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించారు. 3100 ఒరిగామి నెమళ్లు, 1100 ఒరిగామి చొక్కాలు, 3200 ఒరిగామి పందుల బొమ్మలను ఒకేచోట ఏర్పాటు చేయగా.. ఇది అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు సృష్టించారు.


అంతకు ముందు శివాలి కుటుంబం చేతితో తయారుచేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పువ్వులు, ఒరిగామి వేల్స్ పెంగ్విన్లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, కుక్కలు, రాక్షస బల్లులు.. ఇలా చాలా వాటితో వివిధ ప్రదర్శనలు ఏరాపుట చేశారు. అయితే వాళ్లు ఏర్పాటు చేసిన ప్రదర్శనలతో ఇప్పటివరకు 17 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. తాజాగా.. మరో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదు చేయగా.. ఆ సంఖ్య మొత్తం 20కి చేరింది.


ఈ కుటుంబం కేవలం గిన్నిస్ రికార్డులే కాదండోయ్.. 15 అసిస్ట్ వరల్డ్ రికార్డ్, 10 యూనిక్ వరల్డ్ రికార్డులను కూడా తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం 20 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa