తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించటమే కాకుండా.. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అయితే.. ఈ కేసులో నాగార్జునకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ అయిన నాగార్జున.. న్యాయస్థానానికి రావాలని ధర్మాసనం ఆదేశించింది. నాగార్జున స్వయంగా న్యాయస్థానానికి వచ్చి తన వాంగ్మూలాన్ని నేరుగా ధర్మాసనానికి వినిపించాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాతి విచారణను రేపటికి (అక్టోబర్ 8వ తేదీకి)కి వాయిదా వేసింది.
అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. అక్కినేని కుటుంబం మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆరేనని ఆరోపించిన కొండా సురేఖ.. ఎన్- కన్వెన్షన్ కూల్చివేయకుండా కేటీఆర్ పెట్టిన కండీషన్స్ విషయంలో నాగార్జున, నాగచైతన్య వ్యవహరించిన తీరు నచ్చకపోవటం వల్లే.. సమంత విడాకులు తీసుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో.. అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు కూడా కొండా సురేఖ చేసిన ఆరోపణలను ముక్తకంఠంతో ఖండించారు.
ఈ క్రమంలోనే.. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినా.. కేవలం సమంతను ప్రస్తావిస్తూనే ట్వీట్ చేయటం గమనార్హం. దీంతో.. కొండా సురేఖ చేసిన ఆరోపణలతో తమ కుటుంబ పరువు పోయిందని భావించిన నాగార్జున.. ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే.. కొండా సురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన, తమ కుటుంబ పరువును భంగపరిచాయని.. ఆమె చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మీడియాతో పాటు నేషనల్ మీడియాలోనూ ప్రసారమయ్యాయంటూ పిటిషన్‌లో నాగార్జున పేర్కొన్నారు. అందుకు సంబంధించిన క్లిప్పింగులను కూడా కోర్టును సమర్పించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే.. ఓవైపు మంత్రి కొండా సురేఖ, మరోవైపు అక్కినేని నాగార్జున కుటుంబం.. ఇద్దరు కూడా సమాజంలో పేరున్న ప్రముఖులే కావటంతో.. కేవలం మీడియా ట్రయల్స్‌ని ప్రామాణికంగా తీసుకోమని ధర్మాసనం చెప్పినట్లు తెలుస్తోంది. స్వయంగా పిటిషనర్ నాగార్జునే కోర్టుకు వచ్చి తమ వాదనను వినిపించాలని.. తన స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa