తెలంగాణకు చెందిన యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో జరిగిన ఐఎస్ఆర్ లీడర్ షిప్ సదస్సులో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధు రెడ్డి కందకట్లను.. ఐఎస్ఆర్ (Individual Social Responsibility) లీడర్ అవార్డు వరించింది. లండన్‌లోని వెస్ట్మినిస్టర్ చాపెల్‌లో జరిగిన ఐఎస్ఆర్ లీడర్‌షిప్ సదస్సులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సిద్ధు రెడ్డికి ప్రదానం చేశారు. ఈ సదస్సుకు సిద్ధు రెడ్డి హాజరుకాలేకపోవటంతో.. ఈ అవార్డును ఆయన సోదరి స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్దు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఐఎస్ఆర్ లీడర్ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని సిద్ధు రెడ్డి తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోనూ, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తున్నట్టు వివరించారు. ఈ విజయం తనకు మాత్రమే కాక, ఈ విద్యా లక్ష్యాన్ని నమ్మి, తనకు మద్దతు తెలిపిన అందరికీ అంకితమని సిద్ధు రెడ్డి చెప్పుకొచ్చారు.
2014లో సిద్ధు రెడ్డి సామాజిక సేవ చేయటం ప్రారంభించారు. అయితే.. సిద్ధు రెడ్డిని సామాజిక సేవవైపు నడిపించేలా చేసింది ఆయన తల్లి.. కందకట్ల బుచ్చమ్మ పడిన కష్టమే. సిద్ధుకు చదువు చెప్పించటం కోసం.. కష్టపడి కూరగాయలు అమ్మిన బుచ్చమ్మను చూసిన సిద్ధు.. తమ పిల్లలకు చదువు చెప్పించేందుకు ఏ తల్లిదండ్రీ తన తల్లిలా కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ క్రమంలోనే.. కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్న సిద్ధు రెడ్డి.. శంషాబాద్‌లోని సిద్ధాంతి బస్తీలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల దయనీయమైన స్థితిలో ఉండటాన్ని గమనించి చలించిపోయారు. వెంటనే.. ఆ పాఠశాలను పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
రాయన్నగూడా కాచారం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించేందుకు 2020లో సిద్ధు రెడ్డి నడుం బిగించారు. విద్యార్థులు చదువును అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపర్చేందుకు.. మొత్తం రెండు ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. శంషాబాద్ ఆర్జునవాడలో ఓ పాఠశాలకు పక్కా భవనం నిర్మించటమే కాకుండా.. ఆ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. 2024 ఫిబ్రవరిలో నటుడు సోనుసూద్ ప్రారంభించిన ఈ కొత్త సదుపాయాలు 200 మంది విద్యార్థులకుపై లబ్ది చేకూరుస్తున్నాయి. అయితే.. మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడేందుకు ఖర్చుచేయాలంటూ తన తల్లి చెప్పిన మాటలే.. తనను సేవా మార్గంలో నడిపిస్తున్నాయని సిద్ధు రెడ్డి తెలిపారు.
అయితే.. మహిళా విద్యకు సిద్ధు రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలోనే.. పామాకుల్ గ్రామంలో కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే ఈ పాఠశాలలో 500 మంది బాలికలు చదువుకుంటున్నారు. విద్య అనేది మంచి భవిష్యత్తుకు పునాది అని.. ఈ పాఠశాల ద్వారా పామాకుల్ పరిసర గ్రామాల బాలికలకు విద్యా వనరులు అందుబాటులోకి వస్తాయని సిద్ధు ఆకాంక్షించారు.
సిద్ధు రెడ్డి విద్యా సేవలతో పాటు అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు 10కి పైగా యాక్టీవా స్కూటీలు అందించారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అనేక ఆటోలు అందించి అండగా నిలిచారు. నటుడు సోనూ సూద్‌తో కలిసి ఆరోగ్య సేవా కార్యక్రమాలతో పాటు, వరదలు లాంటి విపరీత సహాయ కార్యక్రమాల్లోనూ సిద్ధు రెడ్డి పాలుపంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఐఎస్ఆర్ లీడర్ అవార్డు అందుకున్న సందర్భంగా సిద్ధు తన భావాలను పంచుకున్నారు. ఈ అవార్డు తనకు సేవాభావాన్ని మరింతగా పెంపొందించడానికి ఉత్సాహాన్నిస్తుందన్నారు. ప్రతి చిన్న చర్య సమాజంలో పెద్ద మార్పుకు దారితీస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa