ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరుకు మారుమూల గ్రామమే కానీ.. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 07:33 PM

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం కత్తిమీద సాములాంటిదే. మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. ఒక్క జాబ్ కోసం వందల్లో వేలల్లో కాదు లక్షల్లో పోటీ పడుతున్నారంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే.. ఇంటిని, ఊరిని, కుటుంబాన్ని వదిలేసి.. హైదరాబాద్‌‌లోని ఓ మంచి కోచింగ్ సెంటల్‌లో జాయిన్ అయ్యి.. గంటల తరబడి చదువుతూ ఒక మునిలా తపస్సు చేసినా కూడా.. జాబ్ కొడతామన్న గ్యారెంటీ లేదు. అలాంటిది.. ఓ ఊరిలో ఏ తలుపుతట్టినా ఇంటికి ఒకరో ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటే విచిత్రమే కదు. ఇదేదో ఊహించిన చెప్తున్న కథ కాదండి. ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఊరడించే ప్రయత్నమూ కాదు. కళ్ల ముందు కదలాడుతున్న వాస్తవం.


తెలంగాణలోని.. మెదక్ జిల్లాలో ఉన్న వందలాది గ్రామాల్లో అక్కన్నపేట కూడా ఒకటి. పేరుకు మారుమూల గ్రామమే అయినప్పటికీ.. ఆ ఊరి నిండా ప్రభుత్వ ఉద్యోగులే ఉండటం ఆశ్యర్యం కలిగించే విషయం. రామాయంపేట మండలంలో ఉన్న అక్కన్నపేట గ్రామంలో వందల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా.. గ్రామంలో సుమారు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులోనూ ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉండటం మరో విశేషం. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి డీఎస్సీలోనూ ఈ ఊరి నుంచి ఐదు నుంచి ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికవుతూనే ఉన్నారు.


అక్కన్నపేటలో మొత్తం 1010 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 4,545. ఒకరిని చూసి ఇంకొకరు ప్రేరణ పొందుతున్నారో.. లేదా పోటీతత్వంతో ప్రయత్నిస్తున్నారో.. కానీ మొత్తంగా ఊరిలో చాలా మంది ఉన్నత చదువులు చదువుతూ.. మంచి స్థాయిలో ఉన్నారు. అందులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామం మొత్తంలో 174 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అందులో.. 10 మంది పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వర్తిస్తుండగా.. ఫారెస్ట్, పోస్టల్, ఆర్టీసీ ఇలా అన్ని రకాల శాఖల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే.. వీటన్నింటిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉండటం విశేషం.


 అయితే.. గ్రామంలో అన్ని వర్గాల వారు ఉండగా.. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఉపాధ్యాయ ఉద్యోగులుగా స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి డీఎస్సీలోనూ ఐదు నుంచి ఆరుగురు ఉద్యోగాలు పొందుతుండటం విశేషం.


2008 డీఎస్సీలో అక్కన్నపేటకు చెందిన అభ్యర్థులు 18 మంది ఉపాధ్యాయులుగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక.. గడచిన 20 ఏళ్లలో ఏకంగా 50 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. 2024 డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో ఇద్దరు సెలెక్ట్ కాగా.. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ విభాగంలో ఓ అభ్యర్థి జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. గ్రామంలో పీజీ, బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్లే 200 మందికి పైగా ఉన్నారంటే.. ఎంత మంది టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో చూడండి. అయితే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు ప్రిపేరవుతూ ఉండటం కాకుండా.. కొంతమంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా విధ్యను బోధిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com