తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇక హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చలికాలంలో వేడివేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమో తీసుకోవాలి. శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కూల్గా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఐస్‌క్రీం, చల్లగా ఉన్న నీళ్లను, జూస్‌ను తాగడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. వాటికి దూరంగా ఉంటే మంచిది. గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసరం అయితే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా రక్షణ కలిగించే దుస్తులు వేసుకోవాలి.
చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవటమే మంచిది. చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇంట్లో వైరస్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. జలుబు, దగ్గు ఉన్న వారు తప్పనిసరిగా చేతిరుమాలు వెంట పెట్టుకుని అడ్డుపెట్టుకోవాలి. ఇక ఉదయం పొగమంచు వ్యాపించే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.