ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం.. తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వేశాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురు చూడగా.. ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధం అవుతోంది.
ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్‌లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తెలంగాణలోని మాణిఖ్‌ఘర్, కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజమాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్‌షాపులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.