ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం జూలుమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 21, 2024, 11:22 AM

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ‘ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌గా వ్యవహరించే ఈ విభాగానికి ‘ఈగిల్‌’ అని నామకరణం చేశారు. గత ప్రభుత్వం రూ.100 కోట్లకు పైబడిన టెండర్లకు సంబంధించి సమీక్షకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఇరవై బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు దాని ముందుకు రాగా.. 20 బిల్లులపై ఆమోదముద్ర వేసింది. ఆమోదించని రెండు బిల్లులూ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినవి. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం పెట్టడానికి నాలుగేళ్ల గడువు ఉండాలని గతంలో నిర్ణయించారు. దానిని రెండున్నరేళ్లకు తగ్గిస్తూ పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు మంత్రివర్గ సమావేశం ముందుకు బిల్లులను తెచ్చాయి. ఈ వ్యవహారంలో మరికొంత చర్చ అవసరమని, తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదావేశారు. ఆయన అధ్యక్షతన బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో కేబినెట్‌ సమావేశమైంది. లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో చేసిన చట్టం ప్రకారం.. లోకాయుక్త నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరు. దీంతో ప్రతిపక్ష నేత బదులు.. చట్ట సభల సభ్యులు ఎవరైనా ఉండవచ్చన్న సవరణను ప్రతిపాదించారు. రేషన్‌ బియ్యం అక్రమాలను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) చట్టం పరిధిలోకి తెస్తూ చేసిన సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టం కింద గతంలో కేవలం ఐదు రకాల నేరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 8 రకాల నేరాలను చేర్చారు. అందులో రేషన్‌ బియ్యం అక్రమాలూ ఒకటి. భూ కబ్జాల నిరోఽధ చట్టానికి కూడా మరిన్ని కోరలు తొడిగి కఠిన శిక్షలు పడేలా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. తగిన భద్రత ఉంటే రాష్ట్రంలో పర్యాటకం పెరుగుతుందని, పర్యాటకులు పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేబినెట్‌ అభిప్రాయపడింది. దీని కోసం బీచ్‌ల వద్ద ఈతగాళ్లను నియమించాలని, పోలీసు భద్రత కల్పించాలని, లోపలి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు తగినంత భద్రత కల్పించి ఎక్కడికైనా వెళ్లి క్షేమంగా తిరిగి రాగలిగే పరిస్థితులు కల్పించాలని నిర్ణయించింది. కేరళలో కత్తి యుద్ధం మాదిరిగా మన రాష్ట్రంలో స్థానికంగా పేరు పొందిన ఽథింసా నృత్యం వంటి వాటిని కూడా పర్యాటకంలో భాగం చేయాలని, దీనివల్ల మన ప్రత్యేకత నిలబడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. క్రీడా విధానంగా భాగంగా దివ్యాంగులకు చిన్న నాటి నుంచే క్రీడల్లో ప్రవేశం కల్పించే వ్యవస్థ తీసుకురావాలని.. వారు పతకాలు సాధించిన తర్వాత సన్మానాలు చేయడం కాకుండా కింది స్థాయి నుంచి ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విద్యా మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో క్రీడకు ప్రాధాన్యమిచ్చి శిక్షణ ఇస్తే బాగుంటుందని పవన్‌ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా పని జరుగుతోందని, కొన్నిచోట్ల కొన్ని క్రీడలకు శిక్షణ సౌకర్యాలు ఏర్పడ్డాయని లోకేశ్‌ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com