తెలంగాణలో చలి పులి మొదలైంది. రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. సోమవారం కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలో రెండు మూడు చోట్ల 12 నుంచి 13 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ గురించి కుటుంబ, ఆరోగ్య సంరక్షణశాఖ కమిషనర్ ఈ మేరకు పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు.
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువకు పడిపోయినప్పుడు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేస్తుంటారు. సాధారణంగా నవంబర్ నుంచి మార్చి నెలల మధ్య కాలాన్ని చలిగాలుల సీజన్‌గా చెప్తుంటారు. మరీ ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల మధ్య చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం నవంబర్ నెల మధ్య నాటికే చలిగాలులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. విపరీతమైన చలికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే గాయాలు, ఒక్కోసారి మరణాలు సంభవించవచ్చు. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డకట్టి గాయాలు కావటం, ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
బయట చలి పెరిగితే.. మన దేహం కూడా అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతోంది. బయట నమోదయ్యే ఉష్ణోగ్రతలతో బ్యాలెన్స్ చేసుకోవటానికి శరీరంలోనూ వేడి ఉత్పత్తి అవుతుంది. అయితే తీవ్రమైన చలికి గురైతే.. శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడితో పోలిస్తే కోల్పోయేదే ఎక్కువ అవుతుంది. దీంతో శరీరం పూర్తిగా చల్లబడిపోతుంది. దీనినే హైపోథెర్మియా అంటుంటారు. శరీరం పూర్తిగా చల్లబడిపోతే దాని ప్రభావం మెదడుపై ఉంటుంది. దీంతో మనిషి ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఈ నేపథ్యంలోనే హైపోథెర్మియా ప్రమాదకరమని వైద్యులు చెప్తుంటారు.
ఈ క్రమంలోనే చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దివ్యాంగులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అలాగే ఆరుబయట పనిచేసే కార్మికులు, ఇల్లు లేక వీధుల్లో ఉండే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు సరైన ఆహారం తీసుకుంటూ పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలని సూచించింది. అలాగే చిన్నారులను కూడా చలిగాలులకు బయట తిప్పవద్దని సూచించింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించింది.