ఆడుతూ.. పాడుతూ.. ఉల్లాసంగా గడిపే చిన్నారులు.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఎలాంటి కల్మశం లేని ఆ చిన్ని హృదయాలు చిరు ప్రాయంలోనే ఆగిపోతున్నాయి. హర్ట్ ఎటాక్ అంటే ఏంటో పూర్తిగా తెలియని ఆ పసి ప్రాణాలు పిట్టపిల్లల్లా రాలిపోతున్నాయి. నిండునూరేళ్ల జీవితం అనుభవించాల్సిన ఆ గుండెలు పట్టుమని పదేళ్లు కూడా కొట్టుకోకుండా ఆగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లాలో చిన్నారుల వరుస గుండెపోటు మరణాలు చోటుచేసుకుంటుండటం ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న చిన్నారి నివృత.. నేడు సమన్విత.. ఇలా పదేళ్లు కూడా నిండని చిన్నారులు గుండెపోటుతో కుప్పకూలిపోవటం.. అందరి గుండెల్ని పిండేస్తోంది.
మంర్యాల జిల్లాలోని జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి దిగుట్ల సమన్విత గుండెపోటుతో మృతి చెందింది. నాగరాజు, అనూష దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. అందులో కూతురు సమన్విత.. లక్షేట్టిపేట మండలం కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. రోజూలాగే.. ఈరోజు కూడా పాఠశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో.. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్తూనే.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుర్తించిన తండ్రి నాగరాజు.. తన కూతురిని తీసుకుని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం నిలవలేదు. గుండెపోటుతోనే చిన్నారి సమన్విత మృతిచెందిందని వైద్యులు ధృవీకరించడంతో.. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. అప్పటివరకు ఎంతో హుషారుగా ఉన్న తమ కూతురు.. చూస్తుండగానే కుప్పకూలి విగతజీవిగా మారటాన్ని.. ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషాద వార్త విన్న రోటిగూడ గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పదేళ్లకే నూరేళ్లు నిండాయా తల్లి.. అంటూ కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే.. సరిగ్గా 2 వారాల క్రితం కూడా.. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణం పద్మనగర్ కాలనీకి చెందిన 12 ఏళ్ల నివృతి అనే బాలిక గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. ఆ ఘటన మర్చిపోకముందే.. పదేళ్ల సమన్విత కూడా హార్ట్ ఎటాక్‌తోనే చనిపోవటం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. అల్లారుముద్దుగా అడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన చిన్నారులు.. ఇలా అకస్మాత్తుగా కళ్లముందే పిట్టల్లా రాలిపోతుండటం అందరినీ కలచివేస్తోంది.