త్వరలోనే తెలంగాణలో మరో ఎన్నికల సంబురం రానుంది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుందని ఇప్పటికే జోరుగా ప్రచారం నడుస్తుండగా.. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న టీ జీవన్ రెడ్డినే మరోసారి బరిలో దిగనున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ వార్తలపై జీవన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే నడుచుకుంటానంటూ.. జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికల్లో పోటీ విషయంలో తన వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏమీ ఉండదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన అభిప్రాయాన్ని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్టు తెలిపిన జీవన్ రెడ్డి.. అదే విషయాన్ని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. అయితే.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ విషయంలో మాత్రం తనకు ఎవరూ ఎలాంటి హామీ ఇవ్వలేదని జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా పోటీ చేయలేదని.. పార్టీ నిర్ణయం మేరకే బరిలో దిగానని.. ప్రజల అభిమానం, నమ్మకంతో గెలిచానని చెప్పుకొచ్చారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీలతోనే జీవన్ రెడ్డి సైలెంట్ అయ్యారని వస్తున్న ఆరోపణలపై స్పందించిన జీవన్ రెడ్డి.. తనకు అలాంటి హామీలు ఎవరు ఏమీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.
కాగా.. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతారా.. ఒకవేళ అధిష్ఠానం ఆయన వయసు రిత్యా టికెట్ ఇవ్వకపోతే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి.. రాష్ట్ర నాయకత్వంపై జీవన్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఇటీవల కాంగ్రెస్ నాయకుడి హత్య జరగటంతో మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్న విషయం తెలిసిందే. ఈ తేదీ నాటికి ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే.. అధికార పార్టీగా ఆ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును అధిష్టానానికి పీసీసీ ప్రతిపాదించినట్టుగా ప్రచారం నడుస్తోంది. కాగా.. రాష్ట్ర నాయకత్వంపై ఉన్న కోపంతో.. పోటీకి జీవన్ రెడ్డి నిరాకరిస్తే ఇతరుల పేరును పరిశీలించేందుకు కూడా సీనియర్ మంత్రులతో కమిటీ వేయాలని పీసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.