తెలంగాణలో సంచలనంగా మారిన లగచర్ల ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా కలెక్టర్ మీదికి దాడికి ప్రయత్నించటం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దాడి ఘటన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టింటగా.. దీని వెనుకు పూర్తిగా కుట్ర కోణం ఉందని, అంతా ప్రీ ప్లాన్డ్‌గానే జరిగిందంటూ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిదే ముఖ్యపాత్రగా భావించిన పోలీసులు.. ఆయనపై కేసులు నమోదు చేసి.. అరెస్టు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా.. నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. ఈ కేసులో నరేందర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట లభించింది.
లగచర్ల ఘటనలో భాగంగా.. పట్నం నరేందర్‌రెడ్డిపై బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటం గమనార్హం. అయితే.. పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు వేరువేరుగా కేసులు నమోదు చేశారంటూ.. ప్రభుత్వమే కుట్రపూరితం ఈ కేసులను నమోదు చేపించిందని ఆరోపిస్తూ ఆయన తరపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నరేందర్ రెడ్డిపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.
ఒకే ఘటనపై వేర్వేరుగా కేసులు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ధర్మాసనం దృష్టికి.. నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది తీసుకొచ్చారు. దాడి ఆధారంగా వేర్వేరుగా కేసులు నమోదు చేశారని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. నరేందర్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు.. లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఫార్మ సిటీ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం (నవంబర్ 29న) రద్దు చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. అయితే.. ఆ ప్రాంతంలో టెక్స్‌టైల్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సర్కార్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మళ్లీ కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది.