ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ పాలనను మరింత బలోపేతం చేసి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్.మంత్రిగారి ఆదేశానుసారం, శాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తూ, గ్రామీణ పరిపాలన వ్యవస్థను కొత్త దిశలో మార్చే ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి. గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి హోదా, ఉద్యోగుల పనితీరు, విధులు, మరియు పాలన విధానాలపై సమీక్ష చేసి భవిష్యత్ సంస్కరణల రూపరేఖలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా వెల్లడించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావాలని, ప్రజలకు సేవలపై సంతృప్తి పెరగాలంటే పరిపాలన విధానాలు మరింత సమర్థవంతంగా ఉండాలి అని ఆయన చెప్పారు.స్వచ్చ రథం, మ్యాజిక్ డ్రెయిన్ వంటి పైలట్ ప్రాజెక్టులను ఉదహరిస్తూ, ప్రజలకు ప్రత్యక్ష ఉపయోగపడే ఇలాంటి నూతన ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో విస్తృత మార్పులు తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణను సాంకేతికంగా మరింత బలోపేతం చేయాలని, నీటి సరఫరా పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా, నీటి నాణ్యత పరీక్షలు కచ్చితంగా జరగడం కోసం అధికారులను ఆదేశించారు. నిర్వహణ పనులను సమయానుకూలంగా చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.అంతేకాక, ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షణపై కూడా విస్తృత సమీక్ష చేశారు పవన్ కళ్యాణ్. గ్రామ సభ తీర్మానాలకు అనుగుణంగా పనులు చేపట్టే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, ఈ పథకం ద్వారా శ్రామికుల్లో సానుకూల ప్రభావం తేవాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో తీసుకువచ్చే ప్రతి సంస్కరణ ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేకూర్చేలా ఉండాలి అని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. శాఖల్లో అమలు చేయాల్సిన సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్‌పై సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులు ఆదేశించారు. ఈ అంశంపై వారం రోజుల్లో మరొకసారి సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఓఎస్డీ వెంకట కృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa