రాష్ట్రంలో సంచలన సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల ఫార్మ సిటీ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో ఫార్మ కంపెనీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది. టెక్స్‌టైల్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొంది. మళ్లీ కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటన చేశారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
లగచర్లలో భూసేకరణ కోసం రైతులతో మాట్లాడేందుకు ఈ నెల 11న అక్కడకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై పలువురు దాడి చేయడం వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. కలెక్టర్ సహా.. ఇతర అధికారుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా.. వీడియోలో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లగచర్ల ఘటనలో నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్‌లో రెండింటిని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల దాడి ఘటనలో బొంరాస్ పేట పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులో A2 నిందితుడు సురేష్ సహా 19 మంది రైతులను కూడా అరెస్ట్ చేశారు. రైతుల అరెస్టు సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పలువురు జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కుట్రపూరితంగా అమాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు. గిరిజనులు, ఆడవారి పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని.. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి తమ వారిని అరెస్టు చేశారని ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో 8 మంది సభ్యులతో జాతీయ మానవ హక్కుల సంఘం ఓ బృందాన్ని పంపి..పూర్తి విచారణ చేపట్టింది. లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేతలే రైతులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని ఆరోపణలు చేస్తున్నారు.