ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ ఈవీఎంలను కాదు, ప్రజల మనసులను హ్యాక్ చేస్తున్నారన్న కంగనా

national |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 06:59 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హ్యాక్ చేస్తోంది ఈవీఎంలను కాదు దేశ ప్రజల హృదయాలను అంటూ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ లోక్‌సభలో వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ను గట్టిగా సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న 'ఓట్ల దొంగతనం' ఆరోపణలను నిరాధారమైన ప్రచారంగా కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ దేశ భద్రతకు, మహిళల ఆత్మగౌరవానికి ఎంతో కీలకమని ఆమె ఉద్ఘాటించారు.గత ఏడాది కాలంగా పార్లమెంటులో తన అనుభవాలు చాలా బాధ కలిగించాయని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మమ్మల్ని ప్రతిరోజూ బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. మేమిక్కడ నేర్చుకోవడానికి, దేశానికి సేవ చేయడానికి వస్తే, వారు సభను ముందుకు సాగనివ్వడం లేదు అని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రాహుల్ గాంధీ ఏదో పెద్ద రహస్యం బయటపెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విదేశీ మహిళ ఫొటోను 22 సార్లు ఓటర్ ఐడీలో వాడారంటూ పాత ఆరోపణే చేశారు. కానీ ఆ మహిళ అసలు భారత్‌కే రాలేదని స్వయంగా స్పష్టం చేసింది. ఆ మహిళకు ఈ సభ తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను అని అన్నారు. ప్రతిపక్షాలు తన ఫొటోలను ప్రదర్శించి తనను అవమానించారని, ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని ఆమె మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం 'బేటీ బచావో, బేటీ పఢావో' వంటి పథకాలతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు.పేపర్ బ్యాలెట్ కావాలంటున్న కాంగ్రెస్‌కు కంగనా చరిత్రను గుర్తుచేశారు.ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్‌నారాయణ్ కేసును గుర్తుచేసుకోవాలి. ఆ కేసులో ఇందిర అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఒక్క రాత్రిలో పదవిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ కావాలంటున్న వారు ఆ చరిత్రను మరిచిపోయినట్లున్నారు అని చురకలంటించారు.గాంధీ కుటుంబంపై కంగనా తన దాడిని కొనసాగించారు.ప్రియాంకా గాంధీజీ, ప్రజలు కొన్నిసార్లు ఇతరుల దయపై ఆధారపడవచ్చు. కానీ ఈ దేశ చట్టాలు రాజకీయ కుటుంబాలను కాపాడటానికి కాదు. సోనియా గాంధీకి పౌరసత్వం లేకుండానే 1983 నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది రికార్డుల్లో ఉంది. ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆమె సూటిగా ప్రశ్నించారు.ఓటర్ల జాబితా సవరణను ఒక 'శుద్ధీకరణ ప్రక్రియ'గా అభివర్ణించిన కంగనా, బీహార్ ఉదాహరణను ప్రస్తావించారు. బీహార్‌లో 60 లక్షలకు పైగా వలసదారులు, అనుమానాస్పద ఓట్లను తొలగించారు. ఆ తర్వాత అక్కడ 67 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ప్రక్షాళన దేశవ్యాప్తంగా జరగాలి అని స్పష్టం చేశారు. చివరగా, 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' విధానాన్ని దేశంలో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa